- వివరణ కోరుతూ ఈడీకి నోటీసులు
హైదరాబాద్, వెలుగు: పెట్టుబడిదారులను మోసం చేసిన కేసులో నౌహీరా షేక్‌కు ఈడీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్(ఎన్‌బీడబ్లూ) అమలును నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఈడీకి ఆదేశాలు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. ఈడీ ప్రత్యేక కోర్టు ఈ నెల 7న జారీ చేసిన ఎన్‌బీడబ్ల్యూను రద్దు చేయాలని కోరుతూ నౌహీరాషేక్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని హైకోర్టు గురువారం విచారించింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 16 ఆస్తులను వేలంలో పొందినవారికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కోర్టు ముందు స్వచ్ఛందంగా లొంగిపోయిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కింది కోర్టు ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసిందన్నారు. వారెంట్ అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. కింది కోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించారు.
