హైదరాబాద్, వెలుగు: ఫిన్‌లాండ్‌లో చదివే తెలంగాణ విద్యార్థి మే 6 నుంచి అదృశ్యం కావడంపై వివరాలు అందజేయాలని కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిర్యాదు ఆధారంగా తీసుకున్న చర్యలు తెలియజేయాలని కేంద్రం, ఫిన్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ పోలీసులకు నోటీసులు ఇచ్చింది. విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
ఫిన్‌లాండ్‌లోని యూనివర్సిటీలో హయత్‌నగర్‌కు చెందిన మణిదీప్ మే 6 నుంచి కనిపించడంలేదని ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదంటూ తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిని బుధవారం జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి విచారించారు. పిటిషనర్ల కుమారుడు గతేడాది మార్చిలో విద్యాభ్యాసం కోసం ఫిన్‌లాండ్ వెళ్లారని, మే 5న తల్లితో చివరిసారిగా మాట్లాడుతూ బేకరిలో ఉన్నానని, ఇంటికి వెళుతున్నట్టు చెప్పాడని, రూమ్ సహచరులతో బయటకు వెళుతున్నానని, డబ్బులు పంపాలని కోరాడని పిటిషనర్ లాయర్ చెప్పారు.
ఆ తర్వాత నుంచి అతడి ఆచూకీ తెలియడం లేదని పేర్కొన్నారు. పలుసార్లు ఫోన్ చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వెల్లడించారు. కేంద్రం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పోలీసులు కేసు నమోదు చేశారని, దర్యాప్తు కొనసాగుతోందన్నారు. దీంతో హైకోర్టు విచారణను 24కు వాయిదా వేసింది.
