V6 News

సర్కారు ఫీజు రీయింబర్స్ జీవోపై హైకోర్టు స్టే

సర్కారు ఫీజు రీయింబర్స్ జీవోపై హైకోర్టు స్టే
  • స్టూడెంట్ల నుంచి ఫీజు వసూలు చేయొద్దన్న నిబంధన నిలిపివేత  
  • అది ఇటీవలి హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందన్న బెంచ్ 

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు గురువారం స్టే విధించింది. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులను వారి ఖాతాలో ప్రభుత్వం  జమ చేశాకే వసూలు చేసుకోవాలని, అంతవరకు అడ్మిషన్‌‌‌‌ల సమయంలో ఫీజు చెల్లించాలని విద్యార్థులను అడగరాదన్న నిబంధన అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం బుధవారం జారీ చేసిన జీవో 7లోని 5వ పేరా 12వ నిబంధనను పరిశీలిస్తే.. అది ఇటీవల ఇదే హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందని, ఇది కోర్టు ధిక్కరణేనని వ్యాఖ్యానించింది. ఫీజు రీయింబర్స్ మెంట్ కు సంబంధించిన ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ పలు ప్రైవేటు కాలేజీలు ఇదివరకే హైకోర్టును ఆశ్రయించాయి.

వీటిపై విచారించిన హైకోర్టు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకోవడానికి అనుమతిస్తూ ఏప్రిల్‌‌‌‌ 2న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్‌‌‌‌లపై జస్టిస్‌‌‌‌ జువ్వాడి శ్రీదేవి గురువారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌‌‌‌ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. గత ఉత్తర్వుల ప్రకారం కౌంటర్లు దాఖలు చేయకుండా ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ చెల్లింపు గడువు గురించి చెప్పకుండా ప్రభుత్వం తాజాగా ఈ నెల 29న జీవో 7 జారీ చేసిందన్నారు. ఈ జీవో ప్రకారం విద్యార్థుల నుంచి నేరుగా ఫీజు వసూలు చేయడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు.

అంతేగాకుండా ఏప్రిల్‌‌‌‌ 2న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు ఇది విరుద్ధంగా ఉందన్నారు. జీవోలోని 5వ పేరా 12వ నిబంధన ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు సంబంధించిన ఫీజులను డీబీటీ (డైరెక్ట్‌‌‌‌ బెనిఫిట్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌) పద్ధతిన నేరుగా విద్యార్థుల ఖాతాకు ప్రభుత్వం జమ చేస్తుందని, ఆ తరువాత విద్యార్థులు టీఏఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌సీ నిర్ణయించిన మొత్తాలను ఖాతాల నుంచి చెల్లిస్తారని పేర్కొందన్నారు. ఈ నిబంధన వల్ల కాలేజీలు ఫీజులను వసూలు చేసే పరిస్థితి లేదని, ఆ నిబంధనను నిలిపివేయాలన్నారు. 

విచారణ 4వ తేదీకి వాయిదా.. 

ప్రభుత్వన్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం జీవోను ఏప్రిల్ 29న విడుదల చేసినట్లు ఉదయం తెలిసిందన్నారు. పిటిషనర్లు చెబుతున్న నిబంధన గత మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందని అంగీకరించారు. దీనిపై వివరణ తెలుసుకుని చెప్పడానికి సోమవారం వరకు గడువు కావాలని కోరారు. అంతేగాకుండా కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ చెల్లింపు గడువు, ఏయే కాలేజీలకు టోకెన్‌‌‌‌లు జారీ అయ్యాయి, తదితర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయడానికి గడువు అడిగారు. ఇరుపక్షాల వాదనలను విన్న జడ్జి.. ప్రభుత్వం జారీ చేసిన జీవోలోని నిబంధన అమలును మే 4 వరకు నిలిపివేస్తూ, అదే తేదీకి విచారణను వాయిదా వేశారు.