జీవో 33 చట్ట బద్ధమే: హైకోర్టు

జీవో 33 చట్ట బద్ధమే: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: పాలనాపరమైన అవసరాల కోసం రాష్ట్రం చేసిన పోలీస్‌ కేడర్‌ కేటాయింపులు చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టం చేసింది. జీవో 33ను రద్దు చేసేందుకు నిరాకరించింది.13 మంది అసిస్టెంట్‌ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు(ఏఆర్‌ఎస్‌ఐ)లు దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. 2018 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే జీవో ఉందని స్పష్టం చేసింది. బెటాలియన్ల ప్రాదేశికత ఆధారంగా అప్పీలుదారులను సీజెడ్‌సీ–1కి కేటాయించడం సబబేనని వెల్లడించింది. ఈ మేరకు గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు డివిజన్‌ బెంచ్‌ నిరాకరిస్తూ ఇటీవల తీర్పు వెలువరించింది. 

అప్పీలుదారులను కంటిగ్యూయస్‌ జోనల్‌ కేడర్‌(సీజెడ్‌సీ)–1కి కేటాయింపు చేయడాన్ని వనపర్తి జిల్లా చిన్న మందేడికి చెందిన కె.నరేందర్‌రెడ్డి సహా 13 మంది వేసిన పిటిషన్‌ను గతంలో సింగిల్‌ జడ్జి కొట్టేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ వారంతా దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ డివిజన్‌ బెంచ్‌ విచారించింది.