అధికారులు రాకపోతే సీఎస్ కోర్టుకు రావాలి..తార్నాక పాఠశాల వ్యవహారంలో హైకోర్టు హెచ్చరిక

అధికారులు రాకపోతే సీఎస్ కోర్టుకు రావాలి..తార్నాక పాఠశాల వ్యవహారంలో హైకోర్టు హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాల భవనానికి ప్రభుత్వం ఇంకా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. తార్నాకలోని ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలకు తాత్కాలికంగా విజయ డెయిరీ ఆవరణలో ఖాళీగా ఉన్న రెండు క్వార్టర్లను కేటాయించే అంశంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. తదుపరి విచారణ నాటికి నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది.

తార్నాకలోని విజయ డెయిరీ ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాల పరిస్థితులపై కె.త్రిపురతో పాటు మరో 8 మంది తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌‌‌‌పై జస్టిస్‌‌‌‌ సుద్దాల చలపతిరావు శుక్రవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ప్రస్తుతం పాఠశాల నడుస్తున్న క్వార్టర్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థినుల భద్రతపై ఆందోళన నెలకొందన్నారు.

విజయ డెయిరీ కార్యకలాపాలు ఇప్పటికే రావిర్యాలకు తరలిపోయినందున తార్నాకలోని కొన్ని క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయని, వాటిలో రెండు క్వార్టర్లను స్కూల్‌‌‌‌కు కేటాయించాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని వివరించారు. విజయ డెయిరీ ఆధీనంలోని 42 ఎకరాల భూమిలో ఐదెకరాలను శాశ్వత పాఠశాల నిర్మాణానికి కేటాయించాలని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తూ విచారణను కోర్టు వాయిదా వేసింది.