- 3,400 కాలేజీలకు గానూ.. 1,298లకే దక్కిన పర్మిషన్
- ఇంటర్ అఫిలియేషన్ల ప్రక్రియలో బోర్డు తాత్సారం
- అధికారుల తీరుపై పేరెంట్స్ ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్ బోర్డు తీరు అస్తవ్యస్తంగా మారింది. కాలేజీలు తెరుచుకుని పాఠాలు మొదలైనా, వాటికి ఉండాల్సిన గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయడంలో అధికారులు విఫలమయ్యారు. మే నెలాఖరుకల్లా అఫిలియేషన్ల డెడ్‌లైన్ పెట్టిన బోర్డు..ఇప్పటికీ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఫిబ్రవరి మొదటి వారంలోనే అఫిలియేషన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, ఇంకా కనీసం సగం కాలేజీల ప్రక్రియ కూడా పూర్తి చేయకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది.
60 శాతానికిపైగా కాలేజీలకు రాని అనుమతులు
రాష్ట్రవ్యాప్తంగా 3,400 జూనియర్ కాలేజీలు ఇంటర్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. వీటిలో మంగళవారం రాత్రి నాటికి కేవలం 1,298 కాలేజీలకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. ఇంకా 60 శాతానికి పైగా కాలేజీలు అనధికారికంగానే తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ క్లాసులు సోమవారం నుంచే మొదలయ్యాయి. అయినా, ఇప్పటికీ ఏ కాలేజీకి గుర్తింపు ఉందో, దేనికి లేదో తెలియక స్టూడెంట్లు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
అధికారుల పనితీరుపై గత నెల 26న ‘వెలుగు’లో ‘ఇంటర్ బోర్డు.. ఇదేం అఫిలియేషన్’ అని కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో త్వరలోనే అఫిలియేషన్లు ఇస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత కేవలం గవర్నమెంట్ కాలేజీల్లో కొన్నింటికి మాత్రమే గుర్తింపు ఇచ్చారు. కానీ ప్రైవేటు కాలేజీల అఫిలియేషన్లు ఒక్కటి కూడా చూడలేదు.అఫిలియేషన్ల విషయంలో ప్రైవేటు కాలేజీలనే కాకుండా, సర్కారు కాలేజీలను కూడా ఇంటర్ బోర్డు గాలికొదిలేసింది. గవర్నమెంట్‌తో పాటు గవర్నమెంట్ సెక్టార్‌లోని కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాల గుర్తింపు ప్రక్రియను కూడా పెండింగ్‌లోనే పెట్టింది.
కాలేజీల వారీగా అనుమతుల వివరాలు
రాష్ట్రంలో మొత్తం 1,403 ప్రైవేటు కాలేజీలకు దరఖాస్తు చేస్తే.. కేవలం 209 కాలేజీలకే గుర్తింపు ఇచ్చారు. 430 ప్రభుత్వ కాలేజీల్లో 302 కాలేజీలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. గవర్నమెంట్ సెక్టార్ కాలేజీల్లో 1500 లకు గానూ 800లకు వచ్చారు. అయితే, అఫిలియేషన్ల కోసం ఫిబ్రవరి మొదటి వారంలోనే నోటిఫికేషన్ జారీ చేసినా.. నాలుగు నెలల కాలంలో ప్రక్రియను పూర్తి చేయకపోవడం బోర్డు అధికారుల పనితీరుపై విమర్శలకు దారితీస్తోంది. నెల క్రితం కొత్త కార్యదర్శి అభిలాష బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రైవేటు కాలేజీల దస్త్రాలు ఒక్కటి కూడా ముందుకు కదలకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ స్పందించి, గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను వెంటనే ప్రకటించాలని పేరెంట్స్ కోరుతున్నారు.
