- ఎఫ్ఎల్ఓ తరహాలో మరో ఇండస్ట్రియల్ పార్కుకు ప్లాన్
- ఫ్యూచర్ సిటీలో మహిళా పారిశ్రామికవేత్తలకు ఎకరం స్థలం
- ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ రజతోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: మహిళా సంఘాల ఉత్పత్తులను అమెజాన్ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విక్రయించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ రజతోత్సవ సమావేశంలో సీఎం మాట్లాడారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం ప్రతి మూడు నెలలకోసారి వారితో స్వయంగా సమావేశం నిర్వహిస్తానన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ 2013లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ.. ఇప్పటివరకు అది అమలు కాలేదని, వచ్చే ఎన్నికల తర్వాత అమలవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. హైటెక్ సిటీలో ఫిక్కీ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి1,000 గజాల స్థలంతో పాటు, ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ఎకరం స్థలాన్ని కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
తెలంగాణను ‘ట్రిలియన్ డాలర్’ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక బృందాలు(ఎస్‌హెచ్‌జీలు) కీలక పాత్ర పోషించాలన్నారు. అమెజాన్ లాంటి గ్లోబల్ దిగ్గజాలు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఫ్యూచర్ సిటీలో రానున్న రోజుల్లో ప్రపంచ అగ్రగామి ఫార్చ్యూన్-500 కంపెనీలను నెలకొల్పడమే ప్రభుత్వ లక్ష్యమని.. ఇందులో మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అలాగే, వ్యాపారాల్లో రాణిస్తున్న మహిళా సంఘాలకు ఫిక్కీ ఆధ్వర్యంలో ఏటా అవార్డులు ఇచ్చి గౌరవించుకునే ఆనవాయితీని తీసుకురావాలని సీఎం సూచించారు.
మరో 8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాలు..
మహిళా స్వయం సహాయక బృందాలను బలో పేతం చేసేందుకు కార్పొరేట్ హంగులతో, శిక్షణ, మార్కెటింగ్, వ్యాపార కేంద్రాలుగా పని చేసేలా 22 జిల్లా కేంద్రాలలో ‘ఇందిరా మహి ళా శక్తి భవనాలను’ నిర్మిస్తున్నామని, ఇవి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని సీఎం రేవంత్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన చేశామన్నారు.
హైటెక్ సిటీ ప్రాంతంలో శిల్పారామానికి అనుకుని రూ.1,000 కోట్ల విలువైన స్థలాన్ని ‘ఇందిరా మహిళా శక్తి బజార్’ నిర్వహించడానికి కేటాయించామని, ఇందులో గ్రామీణ హస్తకళలు, సాంప్రదాయ ఉత్పత్తులను విక్రయించడానికి కేటాయించిన150కి పైగా దుకాణాలు విజయవంతంగా నడుస్తున్నాయని వివరించారు.
ఫిక్కీ అభ్యర్థనలను అత్యంత ప్రాముఖ్యతతో నెరవేరుస్తామని, శిల్పారామం పక్కనే వెయ్యి గజాల స్థలాన్ని కేటాయిస్తామని, ఇది హైటెక్ సిటీ, సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) కార్యాలయానికి మధ్యలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని తెలిపారు. ఎఫ్‌ఎల్‌ఓ ఆధ్వర్యంలోని ఇండస్ట్రియల్ పార్క్ విజయవంతమైన నేపథ్యంలో మహిళా సాధికారత కోసం మరొక ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
కార్పొరేట్‌లతో మహిళా సంఘాల పోటీ..
రాష్ట్రంలో మహిళా పొదుపు సంఘాలు సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నాయని, రాష్ట్రంలో దాదాపు 67 లక్షల సంఘాలు ఉండగా, వీటికి రూ.16 వేల కోట్ల రుణాలు అందాయని సీఎం రేవంత్ వెల్లడించారు. ఇప్పుడు మన మహిళలు పెట్రోల్ బంకులను కూడా నిర్వహిస్తూ, కార్పొరేట్ దిగ్గజాలతో పోటీ పడుతున్నారని కొనియా డారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాల కోసం ఇప్పటిదాకా ప్రభు త్వం రూ.11 వేల కోట్లు చెల్లించిందని స్పష్టం చేశారు.
చాలామంది దీనిని ఉచిత ప్రయాణంగా భావిస్తు న్నారని, కానీ వాస్తవానికి మహిళలే వెయ్యి బస్సులకు యజమానులుగా మారి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చి నడుపుతు న్నారని, మహిళలే ఈ బస్సులకు అసలైన యజమానులని వ్యాఖ్యానించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగిన దేశాల్లోనే ఆర్థిక వృద్ధి, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయన్నారు.
మహిళా సంఘాల యాజమాన్యం, నిర్వ హణలో ‘ఇందిరా మహిళా శక్తి పథకం’ కింద 1,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 27 వేల ప్రభుత్వ బడుల నిర్వ హణ బాధ్యతలను మహిళా సంఘాలకే అప్పగించామన్నారు.
