ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ‘తోకలు’ కత్తిరించేదెన్నడు? ..ఇంటర్నేషనల్, వరల్డ్, టెక్నో, మోడల్ వంటి పేర్లు పెట్టవద్దనే రూల్

ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ‘తోకలు’ కత్తిరించేదెన్నడు? ..ఇంటర్నేషనల్, వరల్డ్, టెక్నో, మోడల్ వంటి పేర్లు పెట్టవద్దనే రూల్
  • నిబంధనలు బేఖాతరు చేస్తున్న  మేనేజ్‌‌మెంట్లు
  • ఆ పేర్లతో పేరెంట్స్ నుంచి ఎక్కువ ఫీజుల వసూళ్లు
  • చోద్యం చూస్తున్న ఆఫీసర్లు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. సర్కారు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టానుసారం ఫ్యాన్సీ పేర్లతో బోర్డులు పెట్టేస్తున్నా విద్యాశాఖ అధికారులు  చోద్యం చూస్తున్నారు. ఫలితంగా కార్పొరేట్ మేనేజ్‌‌మెంట్లు ఆకర్షణీయమైన పేర్లతో పేరెంట్స్ ను  నిలువునా దోచుకుంటున్నాయి.  విద్యాహక్కు చట్టంతో పాటు జీవో 91 ప్రకారం.. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లు తమ పేరు పక్కన కేవలం ‘ప్రైవేట్ స్కూల్’ అని మాత్రమే రాసుకోవాలి. ఇంటర్నేషనల్, వరల్డ్, టెక్నో, ఈ-– టెక్నో, మోడల్, కాన్సెప్ట్, స్పేస్, ఐఐటీ, ఒలంపియాడ్ ... లాంటి పదాలను వాడకూడదనే నిబంధనలున్నాయి.  

ఇలాంటి పదాలతో బోర్డులు ఏర్పాటు చేయడానికి వీల్లేదని రూల్స్​ చెప్తున్నాయి. కానీ చాలా స్కూళ్లు ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. రాష్ట్రంలో  13వేలకు పైగా ప్రైవేట్​ స్కూల్స్​ ఉండగా.. ఇందులో దాదాపు మూడో వంతు స్కూళ్లు నిబంధనలకు విరుద్ధంగానే తమ పేర్ల చివరన తోకలను కొనసాగిస్తున్నాయి.  కేవలం ఎంట్రెన్స్ బోర్డులపై, బస్సులపై, గోడలపై, ప్రకటనలపై ఆ పేర్లు ఉంటున్నాయి. రికార్డుల్లో మాత్రం ప్రైవేటు స్కూల్ అని మాత్రమే ఉంటున్నది. స్టూడెంట్లకు ఇచ్చే సర్టిఫికేట్లపైనా ఈ ఫ్యాన్సీ పేర్లు ఉండవని ఆఫీసర్లు చెప్తున్నా రు. కానీ మెజారిటీ తల్లిదండ్రులకు ఈ విషయం తెలియదు. 

దోపిడీయే లక్ష్యంగా..

స్కూల్​ పేరు తర్వాత ఇంటర్నేషనల్, వరల్డ్, టెక్నో, మోడల్  అని పెట్టడం ద్వారా ఏదో పెద్ద చదువులు చెబుతారనే భ్రమను ఈ కార్పొరేట్ స్కూళ్లు తల్లిదండ్రుల్లో కల్పిస్తున్నాయి. ఆ పేర్లను అడ్డంపెట్టుకుని పేరెంట్స్ నుంచి భారీగా ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్ల అక్రమ దందాలపై నిఘా పెట్టాల్సిన విద్యాశాఖ అధికారులు  పూర్తిగా నిద్రమత్తులో ఉన్నారు. జిల్లాల్లో డీఈవోలు, మండల విద్యాధికారులు తనిఖీలు చేయకపోవడం, చేసినా పేర్ల గురించి పట్టించుకోవడంతో మేనేజ్మెంట్లు అవే పేర్లను కొనసాగిస్తున్నాయి.

గతంలో ఆ పేర్లకు నలుపు రంగు పూసి, వాటిని తీసివేయించారు. కానీ, దాదాపు ఐదారు ఏండ్లుగా మళ్లీ ఈ పేర్లను వాడుతున్నాయి. కండ్లముందే నిబంధనలకు విరుద్ధంగా పేర్ల చివర తోకలు కన్పిస్తున్నా.. ఆ స్కూళ్లకు  కనీస నోటీసులు ఇచ్చేందుకు కూడా ఆఫీసర్లు సాహసించడం లేదు. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్కూళ్ల పేర్లపై చర్యలు తీసుకోవాలని, అనధికార బోర్డులను తొలగించాలని విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.