- నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ నిధుల కేటాయింపు
- హైదరాబాద్ ఐకార్‌కు రూ. 2.43 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో వరి సాగు విస్తీర్ణంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలోని 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తెలంగాణ ఈ స్థానం దక్కించుకుంది. అంతర్జాతీయ విత్తన సంస్థ ‘పియనీర్ ఓవర్సీస్ కార్పొరేషన్’ చెల్లించిన రాయల్టీ నిధులను నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ (ఎన్‌బీఏ) అర్హమైన సంస్థలకు పంపిణీ చేసింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదివారం వివరాలు వెల్లడించింది.
‘యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్’ (ఏబీఎస్) నిబంధనల కింద వచ్చిన రూ. 8.22 కోట్లలో.. పరిశోధనా సంస్థలకు రూ. 2.47 కోట్లు, రాష్ట్రాల జీవ వైవిధ్య బోర్డులకు రూ. 5.75 కోట్లను కేటాయించారు. వరి వంగడాలను సంరక్షించి అందించిన హైదరాబాద్‌లోని -ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్’ (ఐకార్, ఐఐఆర్ఆర్)కు అత్యధికంగా రూ. 2.43 కోట్లు దక్కించుకుంది.
ఇక వరి సాగు విస్తీర్ణం ఆధారంగా ఉత్తరప్రదేశ్ జీవ వైవిధ్య మండలికి రూ. 73.26 లక్షలు (మొదటి స్థానం), పశ్చిమ బెంగాల్‌కు రూ. 64.94 లక్షలు (రెండో స్థానం) రాగా.. తెలంగాణ జీవ వైవిధ్య మండలికి రూ. 50,59,674 దక్కి మూడో స్థానంలో నిలిచింది. ఏపీ పదో స్థానంలో నిలిచి రూ. 25,88,278 అందుకుంది. జీవవైవిధ్య చట్టం కింద ఇంత భారీ మొత్తంలో నిధులు పంపిణీ చేయడం ఇదే తొలిసారి అని కేంద్రం తెలిపింది.
