- స్పెషల్ ఆఫీసర్ మున్సిపల్ శాఖలోనే ఉండాలని డిమాండ్
- సవరణలతో సిద్ధమవుతున్న తుది ముసాయిదా
- త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సర్కార్ సన్నాహాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'కోర్ అర్బన్ రీజినల్ ఎకానమీ (క్యూర్) బిల్లు–2026' కు మార్గం సుగమమైంది. అభ్యంతరాలు, సూచనలు, అభిప్రాయాల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. 19 రోజుల వ్యవధిలో వివిధ వర్గాల నుంచి దాదాపు 3,800 అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. బిల్లుపై ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ స్వయంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, పలు వర్గాలతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలను సేకరించారు. ఈ అభ్యంతరాలను వర్గీకరించి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
'చెక్' వ్యవస్థ మున్సిపల్ శాఖ నుంచే ఉండాలి..
అభ్యంతరాల్లో ఒకే అంశానికి సంబంధించి దాదాపు 2,500 ఫిర్యాదులు రావడం గమనార్హం. క్యూర్ బిల్లు నిబంధనల ప్రకారం కార్పొరేషన్ల మేయర్ గానీ, కమిషనర్ గానీ తమ అధికారాలను దుర్వినియోగం చేస్తే, ఆ వ్యవహారంపై విచారణకు ఒక స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని కొత్త చట్టంలో ప్రతిపాదించారు. అయితే ఈ స్పెషల్ ఆఫీసర్‌ను ఏ విభాగం నుంచైనా నియమించవచ్చని ప్రభుత్వం పేర్కొనగా, ఆ అధికారి మున్సిపల్ శాఖకు చెందినవారే అయి ఉండాలని మెజారిటీ అభ్యంతరాల్లో కోరినట్లు తెలుస్తోంది.
ప్రాపర్టీ ట్యాక్స్ పెంచవద్దు..
కొత్త చట్టంలో ఆస్తి పన్ను విధానానికి సంబంధించి కీలక మార్పులు ప్రతిపాదించారు. ప్రస్తుతం పాత జీహెచ్‌ఎంసీ పరిధిలో అమల్లో ఉన్న 'అద్దె విలువ (రెంటల్ వ్యాల్యూ)' ఆధారిత పన్ను విధానానికి బదులుగా, 'క్యాపిటల్ వ్యాల్యూ' ఆధారంగా ఆస్తి పన్ను వసూలు చేయాలని బిల్లులో పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీలో గతేడాది విలీనమైన 27 స్థానిక సంస్థల్లో ఇప్పటికే క్యాపిటల్ వ్యాల్యూ ఆధారంగానే పన్ను వసూలు చేస్తున్నారు.
అయితే, జీహెచ్‌ఎంసీ పరిధిలో పాత పద్ధతే కొనసాగుతుండటంతో ఒకే నగరంలో రెండు రకాల పన్ను విధానాలపై చర్చ జరుగుతోంది. మరోవైపు కొత్త బిల్లు వల్ల జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల పరిపాలనా, ఆర్థిక అధికారాలు తగ్గే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ యాక్ట్–2019 ప్రకారం ప్రస్తుతం జోనల్ స్థాయిలో ఉన్న పలు అధికారాలు, కొత్త బిల్లులోని సెక్షన్–25, 26 ప్రకారం కమిషనర్ అప్పగించే విధులకే పరిమితమవుతాయని, వారికి స్వతంత్రంగా స్థానిక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదని భావిస్తున్నారు.
అసెంబ్లీ ఆమోదమే తరువాయి..
క్యూర్ బిల్లుపై వచ్చిన అభ్యంతరాలు, అభిప్రాయాలు, సూచనలలో చట్టపరంగా సాధ్యమైన, అమలు చేయదగిన అంశాలను సవరణల రూపంలో బిల్లులో చేర్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. అవసరమైన సవరణల అనంతరం, అభ్యంతరాల పరిశీలన పూర్తి చేసి తుది ముసాయిదాను రూపొందిస్తారు. దీనికి కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. శాసనసభ ఆమోదం పొందిన తర్వాత జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ పరిధుల్లో ఈ కొత్త చట్టం అమల్లోకి రానుంది.
