హైదరాబాద్, వెలుగు: దక్షిణాది రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తుల ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం రూ. 2 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 14, 15 తేదీల్లో దక్షిణాది హైకోర్టు న్యాయమూర్తుల ప్రాంతీయ సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది.
ఈ మీటింగ్ నిర్వహణకు అవసరమైన నిధులను విడుదల చేయాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ప్రభుత్వానికి లేఖ రాశారు. రిజిస్ట్రార్ జనరల్ అభ్యర్థనను పరిశీలించిన ప్రభుత్వం మీటింగ్ నిర్వహణ కోసం రూ. 2 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, మద్రాసు హైకోర్టులకు చెందిన న్యాయమూర్తులు పాల్గొననున్నారు. న్యాయవ్యవస్థకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు.
