- 9 ప్రాధాన్య రంగాల ఆధారంగా గ్రామ పంచాయతీ ప్రణాళికలు
- ‘పెసా’ప్రాంతాల్లో 42 అంశాలపై కార్యాచరణను సిద్ధం చేసిన పంచాయతీరాజ్ శాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పల్లెల సమగ్ర వికాసానికి పంచాయతీరాజ్ శాఖ మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. 2026 –-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీ (జీపీడీపీ), మండల/బ్లాక్ (బీపీడీపీ), జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల (డీపీడీపీ) రూపకల్పనకు శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రజల భాగస్వామ్యంతో శాస్త్రీయంగా పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్ ఆధారంగా ప్రణాళికలు రెడీ చేయాలని ఆదేశించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పంచాయతీల అభివృద్ధికి 9 ప్రధాన రంగాలను ఖరారు చేశారు.
వీటి ఆధారంగానే గ్రామాల్లో అవసరాలను గుర్తించి ప్లాన్లను తయారు చేయాలి. ఇందులో పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి, ఆరోగ్యకరమైన పంచాయతీ, బాలల హక్కుల పరిరక్షణ/స్నేహపూర్వక పంచాయతీ, సరిపడా నీటి లభ్యత, పరిశుభ్రమైన, హరిత పంచాయతీ, మౌలిక వసతుల్లో స్వయం సమృద్ధి సాధించిన పంచాయతీ, సామాజిక న్యాయం, సామాజిక భద్రత ఉన్న పంచాయతీ, సుపరిపాలన అందించే పంచాయతీ, మహిళా స్నేహపూర్వక పంచాయతీలుగా గుర్తించనున్నారు.
అయితే, 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, సొంత ఆదాయం తదితర నిధుల ఆధారంగా బడ్జెట్ అంచనాలు వేసుకొని ప్రణాళికలు రూపొందించాలి. 31 జిల్లాల కలెక్టర్లు సంబంధిత శాఖల జిల్లా అధికారులను సమన్వయం చేయాలి. గ్రామాల్లో రూపొందించిన ప్రణాళికలు ఆమోదం పొందిన తర్వాత ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్‌లో అప్‌లోడింగ్ చేసేలా కలెక్టర్లు రోజువారీగా పర్యవేక్షించాలి. ఆగస్టు 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించింది.
గ్రామ సభలకు 17 శాఖల అధికారులు రావాలి..
గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు పంచాయతీ సెక్రటరీల పని మాత్రమే కాదని, గ్రామంలోని అన్ని శాఖల సమన్వయంతో జరగాలని పంచాయతీ రాజ్ శాఖ స్పష్టం చేసింది. 17 రంగాలకు చెందిన గ్రామ స్థాయి అధికారులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు గ్రామసభలకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. వీరంతా తమ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు, కేటాయించిన నిధులు, రాబోయే ఏడాదికి ప్రతిపాదిత పనుల వివరాలను గ్రామసభలో వివరించాల్సి ఉంటుంది.
ఐదో షెడ్యూల్ పరిధిలోని పెసా ప్రాంతాల్లో ముందుగా ప్రతి ‘పెసా’ గ్రామానికి ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేసి, తర్వాత గ్రామ పంచాయతీ స్థాయిలో ఏకీకృతం చేయాలని మార్గదర్శకాల్లో ఆదేశించారు. పెసా గ్రామాధికారాలను ప్రతిబింబించే 42 ప్రత్యేక అంశాలను 9 రంగాలుగా విభజించారు.
అటవీ ఉత్పత్తులు, ఖనిజాల నియంత్రణ, భూముల అక్రమ బదిలీ నిరోధం, మద్యపాన నియంత్రణ, సంప్రదాయ వివాదాల పరిష్కారం, వడ్డీ వ్యాపారుల నియంత్రణ, గ్రామ మార్కెట్ల నిర్వహణ, నీటి వనరుల నిర్వహణ తదితర అంశాలపై పెసా గ్రామసభలు స్వయంగా ప్రణాళికలు తయారు చేసుకుంటాయి. ఇందుకు ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్‌లో ప్రత్యేక సదుపాయం కల్పించారు. అంతేకాదు, ఈసారి గ్రామసభల నిర్వహణలో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు.
