హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలు రాసినవారిలో 82.61శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గురువారం హైదరాబాద్‌లోని టెన్త్ పరీక్షల ఫలితాలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఆఫీస్లో ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ లింగయ్యతో కలిపి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ రిలీజ్ చేశారు. రాష్ట్రంలో ఈనెల 5 నుంచి 12 వరకు నిర్వహించిన అడ్వాన్స్డ్సప్లిమెంటరీ పరీక్షలకు 27,857 మంది హాజరయ్యారు.
అందులో 23,013 మంది పాసయ్యారు. పరీక్షలకు హాజరైన బాలుర ఉత్తీర్ణత 81.29 శాతంగా నమోదు కాగా, బాలికలు 84.87 శాతంతో మంచి మార్కులు సాధించారు. జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, ములుగు జిల్లాలు 100 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచాయి. వికారాబాద్ జిల్లా అత్యంత తక్కువగా 44.43 శాతం ఫలితాలతో చివరి స్థానంలో నిలిచింది. కాగా, ఈనెల26 నుంచి జూలై 5 వరకు ఆన్‌లైన్‌లో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్ కోసం రూ.వెయ్యి ఫీజుగా నిర్ణయించారు.
