అమరవీరులను అవమానించేలా  ఏపీ లీడర్ల కామెంట్లు

అమరవీరులను అవమానించేలా  ఏపీ లీడర్ల కామెంట్లు
  • తెలంగాణ సంపదపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నరు: పృథ్వీరాజ్​
  • ఏపీ నాయకులు 58 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారు: సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి
  • ‘తెలంగాణమంటే ఉగ్రవాదమా?’ అంశంపై రౌండ్‌‌‌‌ టేబుల్‌‌‌‌ సమావేశం 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మద్దతు తెలుపడంపై పలువురు తెలంగాణ వాదులు తప్పుపట్టారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో క్రాంతిదళ్ ఆధ్వర్యంలో ‘తెలంగాణమంటే ఉగ్రవాదమా’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రాంతిదళ్ అధ్యక్షుడు పృధ్విరాజ్ యాదవ్ మాట్లాడుతూ ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని పవన్ కళ్యాణ్ అనడం దారుణమన్నారు.

తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను అవమానించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని ఫైర్​అయ్యారు. ఈ వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థించడం సరికాదన్నారు. తెలంగాణ సంపద, వనరులపై కొందరు ఆధిపత్యం చలాయించాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ చరిత్ర, ప్రత్యేకతను ఎవరూ తక్కువ చేసి చూడొద్దని చెప్పారు. ఇటీవల ఏపీలో జరిగిన మహానాడులో తెలంగాణకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ పదం డిక్షనరీలో లేదని వ్యాఖ్యలు చేసి యావత్​ తెలంగాణ సమాజాన్ని అవమానించారని గుర్తుచేశారు.  

నిజాం పాలనలో ఉన్న తెలంగాణకు, మద్రాస్ ప్రెసిడెన్సీ ఆధీనంలో ఉన్న ఏపీకి మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల రాజకీయ ఎత్తుగడలను తిప్పికొడతామని హెచ్చరించారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ తెలంగాణలో ఏపీ నాయకులు 58 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఆరోపించారు. నిజాం కాలం నాటి భూములను ఆంధ్ర నాయకులు దోచుకున్నారని అన్నారు. ఇక్కడి భూమిపుత్రులను ఆగం చేసి, రాష్ట్రాన్ని దోచుకొని ప్రజలను బిచ్చగాళ్లను చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలపై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఫైర్​అయ్యారు. ఏపీ, తెలంగాణల్లోని పేదలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.