- రూ.263 కోట్లతో 10 ఆర్డీవో, 107 తహసీల్దార్ ఆఫీసుల నిర్మాణం
- లేట్ కాకుండా ఉండేందుకే ప్రభుత్వం నిర్ణయం
- స్థలాల అప్పగింతకు కార్పొరేషన్ లేఖ.. త్వరలోనే టెండర్లు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఆర్డీవో, తహసీల్దార్ ఆఫీసులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్మాణ బాధ్యతలను హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించింది. సాధారణంగా ఈ బాధ్యతలను మున్సిపల్ శాఖలోని పబ్లిక్ హెల్త్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ వంటి శాఖలకు అప్పగిస్తారు. కానీ, తొలిసారిగా హౌసింగ్ శాఖ ఈ నిర్మాణ బాధ్యతలను చేపట్టనుంది.
మిగిలిన శాఖల పరిధిలో ఇప్పటికే చాలా ప్రాజెక్టులు ఉండటం వల్ల, ఈ బాధ్యతలను కూడా వారికే అప్పగిస్తే మరింత ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇతర శాఖలైతే టెండర్లు పిలిచేందుకే నెలల తరబడి సమయం తీసుకుంటారని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. నిర్మాణ బాధ్యతలను హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించే అంశంపై రెవెన్యూశాఖ సెక్రటరీ లోకేశ్ కుమార్ జీవో జారీ చేశారు.
ఆర్డీవో, తహసీల్దార్ ఆఫీసులు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసింది. వీటికి సొంత బిల్డింగ్స్ నిర్మించకపోవడంతో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు సొంత భవనాలు నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో అద్దె భవనాలు, ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతూ శిథిలావస్థకు చేరుకున్న వాటిని గుర్తించి సొంత భవనాలను నిర్మించనుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.263.25 కోట్ల వ్యయంతో 10 ఆర్డీవో, 107 తహసీల్దార్ కార్యాలయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించి జీవో ఇచ్చింది.
ఈ నేపథ్యంలో వీటి నిర్మాణానికి అవసరమైన స్థలాలు అప్పగించాలని రెవెన్యూ శాఖకు హౌసింగ్ కార్పొరేషన్ లేఖ రాసింది. ఆ స్థలాలను జిల్లాల్లో ఉన్న హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లకు అప్పగించాలని లేఖలో పేర్కొంది. ఆ వెంటనే కార్పొరేషన్ అధికారులు టెండర్లు పిలవనున్నారు. నిర్మాణ బాధ్యతలను చేపట్టినందుకు మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 3 శాతం నిధులను హౌసింగ్ కార్పొరేషన్‌కు రెవెన్యూ శాఖ చెల్లించనుంది.
ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన అనుభవం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నల్గొండ జిల్లాలో 16 తహసీల్దార్ ఆఫీసులను కేవలం 6 నెలల్లోనే హౌసింగ్ కార్పొరేషన్ పూర్తి చేసింది. వీటితోపాటు నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్, మాదాపూర్ శిల్పారామం, టోలిచౌకిలోని హస్తం స్టాచ్యూ, వరంగల్ సెంట్రల్ జైలులోని రిసెప్షన్ బిల్డింగ్, హైదరాబాద్ కలెక్టరేట్లోని మరో బిల్డింగ్ కూడా హౌసింగ్ కార్పొరేషన్ నిర్మించిన అనుభవం ఉందని అధికారులు చెబుతున్నారు. గత రెండేళ్లలో హౌసింగ్ కార్పొరేషన్ బీటెక్ లో 85 శాతానికి పైగా మార్కులు సాధించిన సుమారు 400 మంది యువ ఇంజినీర్లను రిక్రూట్ చేసుకుంది. ప్రస్తుతం వీరంతా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌లో అసిస్టెంట్ ఇంజినీర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
శాశ్వత భవనాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి
దశలవారీగా తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించాం. తొలి విడతలో అద్దె భవనాలు, శిథిలావస్థలో ఉన్న 107 తహసీల్దార్ కార్యాలయాలు, 10 ఆర్డీవో కార్యాలయాలను రూ.263 కోట్లతో నిర్మిస్తాం. స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి రూ.97 కోట్లతో 48 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో డీఐజీ కార్యాలయాలను నిర్మిస్తున్నాం. ఈ భవనాల కోసం రెండు విభాగాలకు కలిపి మొత్తం రూ.360 కోట్లతో అనుమతులు జారీ చేశాం. వీటన్నింటి నిర్మాణ బాధ్యతలను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించాం.
