- డ్రిప్ పరికరాల కొరత ఉండొద్దని సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయిల్‌పామ్ సాగు విస్తరణను మరింత పెంచాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన ఆయిల్‌పామ్ మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాల కొరత లేకుండా చూడాలని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయిల్‌ఫెడ్ కార్యాలయంలో ఆయిల్‌పామ్ సాగు, నర్సరీలు, ప్రాసెసింగ్ యూనిట్ల పురోగతిపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ నీటితో పండే పంటలపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. మార్కెట్‌లో ఆయిల్‌పామ్ గెలలకు మంచి ధర లభిస్తోందని తెలిపారు. రైతుల డిమాండ్‌కు అనుగుణంగా నర్సరీల్లో తగినన్ని మొక్కలను అందుబాటులో ఉంచాలని అధికారులకు చెప్పారు. ఖమ్మం జిల్లా కల్లూరుగూడెంలో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. 'విజయ్' బ్రాండ్ వంటనూనెల విక్రయాలను విస్తరించేందుకు ప్రామాణిక మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించాలన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేందర్ మోహన్, ఆయిల్‌ఫెడ్ ఎండీ యాస్మీన్ బాషా తదితరులు పాల్గొన్నారు
