- రెండుమూడు నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ
- హాకా, రెడ్కోల సమన్వయంతో అమలు
- కరెంట్ బిల్లుల భారం నుంచి క్షేత్రస్థాయి సిబ్బందికి ఊరట
హైదరాబాద్, వెలుగు: రైతు వేదికలకు సౌర విద్యుత్ వెలుగులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 2,600 రైతు వేదికలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దశలవారీగా ప్రాజెక్టును అమలు చేసి రెండు, మూడు నెలల్లో పనులు పూర్తి చేసే దిశగా కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలైన హాకా, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. రైతు వేదికల్లో వ్యవసాయ విస్తరణ అధికారితో పాటు కాన్ఫరెన్స్ హాల్, వ్యవసాయ సంబంధిత సేవలకు అవసరమైన సదుపాయాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
కరెంట్ బిల్లుల భారం తగ్గే అవకాశం..
రైతు వేదికల నిర్వహణలో విద్యుత్ బిల్లులు భారంగా మారుతున్న నేపథ్యంలో సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు నిర్ణయం క్షేత్రస్థాయి సిబ్బందికి ఊరటనిచ్చే అవకాశం ఉంది. విద్యుత్ అవసరాల్లో చాలా భాగాన్ని సౌర విద్యుత్‌తో తీర్చడం ద్వారా భవిష్యత్‌లో వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. అయితే, ఒక్కో రైతు వేదికకు ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ కెపాసిటీ, అంచనా వ్యయం, నిధుల విధానం వంటి అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
హాకా నోడల్ సంస్థగా.. రెడ్కో సాంకేతిక సహకారం..
రైతు వేదికలపై సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటుకు హాకా, రెడ్కో సమన్వయంతో ముందుకు వెళ్లనున్నాయి. రైతు వేదికల భవనాలపై సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి అవసరమైన సాంకేతిక సాధ్యాసాధ్యాలు, విద్యుత్ వినియోగం, గ్రిడ్ అనుసంధానం, పరికరాల నాణ్యత, నిర్వహణ వంటి అంశాలను పరిశీలించనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన రెడ్కో సోలార్పవర్రంగంలో పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. రూఫ్ టాప్సోలార్వ్యవస్థల్లో నెట్ మీటరింగ్, డిస్కంల అనుమతులు, సిస్టమ్ ఇన్స్టాలేషన్, నిర్వహణ తదితర అంశాలకు సంబంధించిన విధానాలు, సాంకేతిక ప్రక్రియలను సంస్థ ఇప్పటికే నిర్వహిస్తోంది.
నాణ్యత, నిర్వహణపై ప్రత్యేక దృష్టి..
సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కేవలం ప్యానెల్స్ బిగించడంతో ముగియకుండా, దీర్ఘకాలికంగా విద్యుత్ ఉత్పత్తి జరిగేలా వ్యవస్థను రూపొందించడం కీలకం. ప్యానెల్స్ తో పాటు ఇన్వెర్టర్లు, మౌంటింగ్ స్ట్రక్చర్, వైరింగ్, రక్షణ పరికరాలు, మీటరింగ్, అవసరమైన చోట గ్రిడ్ అనుసంధానం వంటి అంశాలపై సాంకేతిక ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. టీజీ రెడ్కో అమలు చేస్తున్న రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టుల్లో వ్యవస్థల ఏర్పాటు అనంతరం పరీక్షలు, తనిఖీలు, నెట్ మీటర్ అనుసంధానం, ప్రాజెక్టు పూర్తి నివేదిక వంటి ప్రక్రియలు ఉన్నాయి. పరికరాల నాణ్యత, వారంటీ, నిర్వహణ అంశాలకు ప్రాధాన్యం ఇస్తోంది.
రైతు వేదికల వినియోగం మరింత పెరిగేలా..
రైతు వేదికలకు సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తే వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి కార్యకలాపాలకు మరింత వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ లక్ష్యాల్లో రైతులకు సాంకేతిక సేవలు, సమర్థవంతమైన విస్తరణ వ్యవస్థ, యాంత్రీకరణ వంటి అంశాలు కీలకంగా ఉన్నాయి.
మూడు నెలల్లోనే పూర్తి చేసే లక్ష్యం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు వేదికలను దశలవారీగా ఎంపిక చేసి, వాటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదట సాంకేతికంగా అనుకూలమైన భవనాలను గుర్తించడం, విద్యుత్ వినియోగ అవసరాలను అంచనా వేయడం, అవసరమైన సామర్థ్యాన్ని నిర్ణయించడం, అమలు సంస్థలను ఖరారు చేయడం వంటి ప్రక్రియలు జరుగనున్నాయి. రెండు మూడు నెలల వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు హాకా, టీజీ రెడ్కోల మధ్య సమన్వయం అత్యంత కీలకం కానుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రైతు వేదికలు కేవలం రైతుల సమావేశ కేంద్రాలుగానే కాకుండా స్వయం విద్యుత్ అవసరాలను తీర్చుకునే గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లుగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది.
