- చదవడం, రాయడంతో పాటు లెక్కల్లో 80% పట్టు సాధించడమే టార్గెట్
- ప్రతి క్లస్టర్ నుంచి మూడు స్కూళ్ల చొప్పున ఎంపిక
- వచ్చే నెల నుంచి అమల్లోకి కొత్త విధానం
హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలను పెంపొందించేందుకు ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) కాంపిటెంట్ స్కూల్స్ పేరుతో ప్రభుత్వం సరికొత్త ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. రాష్ట్రంలో 1,817 స్కూల్ కాంప్లెక్స్/క్లస్టర్లు ఉన్నాయి.
ఒక్కో క్లస్టర్‌లో ఎక్కువ ఎన్‌రోల్‌మెంట్ ఉన్న మూడు ప్రైమరీ లేదా అప్పర్ ప్రైమరీ స్కూళ్లను ఈ ప్రోగ్రామ్‌కు ఎంపిక చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం మొదటి విడతలో భాగంగా మొత్తం 5,451 స్కూళ్లను ఈ నెల 22లోగా సెలెక్ట్ చేయనున్నారు. కలెక్టర్ల ఆమోదంతో జాబితాను సిద్ధం చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఇప్పటికే డీఈఓలకు ఆదేశాలు జారీచేశారు. ఎంపికైన వాటిని మోడల్ స్కూల్స్‌గా తీర్చిదిద్ది, అక్కడ సాధించిన ఫలితాలను బట్టి మిగతా స్కూళ్లకు విస్తరిస్తారు.
చదవడం, రాయడమే లక్ష్యం..
ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు అక్షరాలు గుర్తుపట్టడం, అనర్గళంగా చదవడం, తప్పులు లేకుండా రాయడంతో పాటు బేసిక్ లెక్కలు చేయడం వంటివి నేర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పిల్లలు వీటిల్లో 80 శాతం నైపుణ్యం సాధించేలా చర్యలు తీసుకుంటారు. ప్రధానంగా 2, 3 తరగతుల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. దీనికోసం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, టీచర్ హ్యాండ్ బుక్స్, స్టూడెంట్ వర్క్ బుక్స్‌ను పక్కాగా వినియోగించనున్నారు.
జులై నుంచి అమలు..
ఈ విధానం జులై నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. స్కూళ్లు ప్రారంభమైన మొదటి 45 రోజులు విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి రెడీనెస్ క్లాసులు నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఒక పీరియడ్‌ను ‘ఎఫ్ఎల్ఎన్ ఎన్‌రిచ్‌మెంట్’ శిక్షణ కోసం కేటాయిస్తారు. వెనుకబడిన విద్యార్థులకు రెమిడియల్ టీచింగ్ చేస్తారు.
ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ఎంఈఓలు నెలకోసారి, ప్రతి కాంపిటెంట్ స్కూల్‌ను కాంప్లెక్స్ హెచ్‌ఎంలు నెలకు రెండు సార్లు తనిఖీ చేసి గైడెన్స్ ఇవ్వాలని డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలిచ్చారు. విద్యార్థుల లెర్నింగ్ లెవల్స్‌ను బట్టి బేస్‌లైన్, మిడ్‌లైన్, ఎండ్‌లైన్ అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహించి, వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
