- సైలో ప్రాజెక్ట్‌తో పంట కోతల తర్వాత నష్టాలకు చెక్ పెట్టొచ్చని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రైతుల పంటలకు కోత అనంతరం ఎదురవుతున్న నష్టాలను తగ్గించి ఆహార భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ఆధునిక సైలో ఆధారిత శాస్త్రీయ ధాన్యం నిల్వల వ్యవస్థ ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ అంశంపై సివిల్ సప్లయ్స్శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన గురువారం సెక్రటేరియట్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ప్రాథమికంగా 20 లక్షల టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యంతో సైలో ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
వరి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి ప్రధాన పంటలను శాస్త్రీయంగా నిల్వ చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని చెప్పారు. దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని, పంటల కొనుగోలు సమయంలో నిల్వ సమస్యలు తలెత్తకుండా ఈ సైలో వ్యవస్థ కీలకంగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.
రెండేండ్లదాకా ధాన్యం ఖరాబ్ కాదు
సైలో వ్యవస్థలో ఆధునిక క్లీనర్లు, డ్రైయర్లు ఏర్పాటు చేసి ధాన్యం నాణ్యతను కాపాడవచ్చని మంత్రి ఉత్తమ్ తెలిపారు. తేమ శాతం తొలగించి రెండేళ్ల వరకు ధాన్యాన్ని భద్రపరచేలా ఈ వ్యవస్థ పనిచేస్తుందన్నారు. ‘‘ప్రస్తుతం కొనుగోలు చేసిన వరిని నేరుగా రైస్ మిల్లులకు పంపడంతో మిల్లింగ్‌లో ఆలస్యం, సరైన నిల్వ సౌకర్యాలు లేకపోవడం వంటి కారణంగా పంట నష్టపోతున్న పరిస్థితి ఉంది. సైలో వ్యవస్థ అమలులోకి వస్తే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
ఆర్థికపరంగానూ ఈ ప్రాజెక్టు అత్యంత ప్రయోజనకరం” అని మంత్రి పేర్కొన్నారు. ధాన్యం పాడైపోవడం, రైస్ మిల్లింగ్ వ్యవస్థలో చోరీలు, డిఫాల్ట్ మిల్లర్ల కారణంగా రాష్ట్రానికి ఏటా దాదాపు రూ.5,000 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోందని మంత్రి వెల్లడించారు.
ఈ నష్టాలను అడ్డుకుంటే సైలో ప్రాజెక్టుపై పెట్టే మొత్తం వ్యయం ఒక్క ఏడాదిలోనే తిరిగి రాబట్టుకోవచ్చని చెప్పారు. సంప్రదాయ గోదాముల కన్నా సైలో ఆధారిత ఆధునిక నిల్వలకే ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్రాజెక్టు అమలుకు రోడ్‌మ్యాప్‌ను త్వరలో ఖరారు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఎఫ్‌సీఐ అధికారులు పాల్గొన్నారు.
