- సౌత్‌లో ఫస్ట్ ప్లేస్.. నేషనల్ లెవల్‌లో మూడో ర్యాంకు
- రాష్ట్ర ప్లానింగ్ బోర్డు రిపోర్టు వెల్లడి
- ఆరేండ్లలో ఐటీ ఎగుమతులు రెండింతలు
- 93.8 శాతం పెరిగిన తలసరి ఆదాయం
హైదరాబాద్, వెలుగు: ‘‘గత ఆరేండ్లలో సాధించిన రాష్ట్ర గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీఎస్డీపీ) వృద్ధి రేటులో మన రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో నిలిచింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి జీఎస్డీపీ నివేదికలు విడుదల చేసిన 18 రాష్ట్రాల్లో తెలంగాణ మూడో ప్లేస్‌లో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో టాప్ లో నిలిచింది” అని రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ మేరకు ‘తెలంగాణ జర్నీ–ట్రైబ్లేజింగ్ ఇట్స్ వే టు సక్సెస్’ పేరుతో మంగళవారం రిపోర్ట్ విడుదల చేసింది. కరోనా, లాక్ డౌన్ సంక్షోభంలో జీడీపీ మైనస్ 3లోకి వెళ్లినా తెలంగాణ మాత్రం ప్లస్ 2.4 శాతం జీఎస్డీపీ వృద్ధి రేటు సాధించిందని చెప్పింది. రిపోర్టులో ఏం చెప్పిందటే...
దేశ సగటు కంటే ఎక్కువ
2014-–15 నుంచి 2020–-21 దాకా జాతీయ తలసరి ఉత్పత్తి (ప్రస్తుత ధరలు) 58.4% పెరగగా తెలంగాణ జీఎస్డీపీ 93.8% పెరిగింది. తాజా లెక్కల ప్రకారం 2020–--21కి రాష్ట్ర సంపద ప్రస్తుత ధరల్లో రూ.9,80,407 కోట్లు. 2015–16 నుంచి 2020 – 21 వరకు ఆరేండ్ల జీఎస్డీపీ గ్రోత్ రేట్ ఆధారంగా వార్షిక సగటు వృద్ధి రేటు(ఏఏజీఆర్)ను ప్రస్తుత ధరల్లో లెక్కిస్తే తెలంగాణ 11.7 శాతం సాధించింది. ఆంధ్రప్రదేశ్ 11.2 శాతం, కర్నాటక 10.6 శాతం, కేరళ 10.8, తమిళనాడు 10.1 సాధించాయి. ఒక్క 2020–21నే తీసుకుంటే సౌత్ లో తమిళనాడు అత్యధికంగా 5.9 శాతం నమోదు చేసింది. తెలంగాణ 2.4 శాతం గ్రోత్ రేట్ సాధించింది. ధాన్యం ఉత్పత్తి ఐదు రెట్లు, పత్తి ఉత్పత్తి రెండున్నర రెట్లు పెరిగాయి. ఇక ఐటీ ఎగుమతుల విలువ ఆరేళ్లలో డబులైంది. 6.28 లక్షల మందికి ఉపాధి దొరికింది. ఐటీ ఎగుమతుల విలువ రూ.66,276 కోట్ల నుంచి రూ.1,45,522 కోట్లకు పెరిగింది.
