- ఒకే యాత్రలో ముక్తేశ్వరుని దర్శనం, రామప్ప సందర్శన
- హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఏసీ బస్సులు
హైదరాబాద్, వెలుగు: భూపాలపల్లి జయశంకర్ జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం శుక్రవారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ రవాణా, భోజన వసతులతో కూడిన ప్యాకేజీని రూపొందించింది. హైదరాబాద్ నుంచి నేరుగా ఏసీ బస్సులను నడపనుంది. ఈ యాత్ర కోసం రెండు రకాల బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఏసీ హైటెక్ స్లీపర్ (30 సీట్లు) పెద్దలకు రూ. 3,600, పిల్లలకు (12 ఏళ్లు) రూ. 2,880. ఏసీ మినీ కోచ్ (21 సీట్లు) పెద్దలకు రూ. 2,800, పిల్లలకు రూ. 2,240 చార్జీలు నిర్ణయించింది.
ఈ ప్యాకేజీలో భక్తులు ఒకే యాత్రలో ఆధ్యాత్మిక క్షేత్రంతోపాటు రామప్పను కూడా దర్శించుకోవచ్చు. ఈ ప్యాకేజీలో ఏసీ రవాణా, దేవాలయ దర్శనం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం హై-టీ, గైడ్ సేవలు కలిసి ఉంటాయి. రాత్రి భోజనం, ఉదయం అల్పాహారం, వసతి సౌకర్యాలను భక్తులే వ్యక్తిగతంగా చూసుకోవాల్సి ఉంటుంది. భక్తులు టికెట్ల కోసం బషీర్‌బాగ్‌లోని సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం లేదా 040-29801040, 98485 40371, 1800-4254-5454 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చు. సంస్థ అధికారిక వెబ్‌సైట్ tourism.telangana.gov.in ద్వారా కూడా టికెట్లు పొందవచ్చు.
