తెలంగాణ, జర్మనీ మధ్య మరింత సహకారం...ఇరు ప్రాంతాల మధ్య సమన్వయ బృందం ఏర్పాటు: మంత్రి వివేక్

తెలంగాణ, జర్మనీ మధ్య  మరింత సహకారం...ఇరు ప్రాంతాల మధ్య సమన్వయ బృందం ఏర్పాటు: మంత్రి వివేక్
  •     వృత్తి నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, పారిశ్రామిక రంగాల్లో భారీ అవకాశాలు
  •     తెలంగాణ యువతకు ఉపాధిలో ఏటీసీలు, టామ్‌‌కామ్‌‌ కీలకం
  •     సెక్రటేరియెట్‌‌లో జర్మనీ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో భేటీ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ -జర్మనీ మధ్య సమన్వయం, సహకారం మరింత పెరగనుందని, ఈ నేపథ్యంలో వృత్తి నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, పారిశ్రామిక రంగాల్లో ఇరు ప్రాంతాలకు విశేష అవకాశాలు ఉంటాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం సెక్రటేరియెట్‌‌లో జర్మనీలోని తురింగియా రాష్ట్ర ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో ఆయన సమావేశమయ్యారు. విదేశీ ఉపాధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. 

సంస్థాగత సహకారం కోసం తెలంగాణ, -జర్మనీ మధ్య ఒక ‘సమన్వయ బృందాన్ని’ఏర్పాటు చేయాలని మంత్రి ప్రతిపాదించారు. నైపుణ్యాభివృద్ధి, మానవ వనరులు, పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో కొత్త అవకాశాల కోసం ఈ బృందం పనిచేస్తుందని చెప్పారు. నైపుణ్యంతో కూడిన మానవ వనరుల అభివృద్ధి, వర్క్‌‌ఫోర్స్ మొబిలిటీ, పారిశ్రామిక సహకారం వంటి పరస్పర అంశాలపై చర్చలు జరిగాయి. జర్మనీలోని వివిధ రంగాల్లో తెలంగాణ యువతకు ఉపాధి కల్పించేందుకు టామ్‌‌కామ్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను మంత్రి వివరించారు. నైపుణ్యాభివృద్ధి రంగంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టిందని తెలిపారు. 

ఏటీసీల్లో నైపుణ్య యువత.. 

సంప్రదాయ ఐటీఐలను ఆధునిక అడ్వాన్స్‌‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీలు) అభివృద్ధి చేశామని మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. దేశీయ, అంతర్జాతీయ పరిశ్రమల అవసరాలు తీర్చే అత్యున్నత నైపుణ్యాలతో కూడిన యువశక్తిని ఏటీసీలు తయారు చేస్తున్నాయని వివరించారు. రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టామ్‌‌కామ్ కృషి చేస్తోందని చెప్పారు. 

ఇందులో భాగంగా జర్మన్ భాషతో పాటు ఇతర భాషా శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోందని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ అందించి అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా కార్మిక శాఖ, టామ్‌‌కామ్ చేస్తున్న కృషిని జర్మన్ ప్రతినిధి బృందం అభినందించింది.

జర్మనీలో ఉద్యోగాలకు తెలంగాణ నర్సులు..

టామ్‌‌కామ్ ద్వారా శిక్షణ పొందిన నర్సుల బృందం ఈ సమావేశంలో మంత్రి వివేక్, జర్మన్ ప్రతినిధులను కలిశారు. భాషా శిక్షణ, విదేశీ ఉద్యోగ అవకాశాలు, ప్లేస్‌‌మెంట్ కార్యక్రమాలపై తమ అనుభవాలను వారు పంచుకున్నారు. ఉన్నత స్థాయి జర్మన్ భాషా అర్హత సాధించిన ఈ నర్సులు.. త్వరలోనే టామ్‌‌కామ్ సహకారంతో జర్మనీలో ఉద్యోగాల్లో చేరనున్నారు. 

ఈ సమావేశంలో ఎల్‌‌ఈటీఎఫ్ కార్యదర్శి దాసరి హరిచందన టామ్‌‌కామ్ ద్వారా అమలు చేస్తున్న శిక్షణా కార్యక్రమాలకు సంబంధించిన సాంకేతిక, నిర్వహణ అంశాలను వివరించారు. ఈ సమావేశం నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ ఉపాధి కల్పన రంగాల్లో తెలంగాణ-, జర్మనీ మధ్య బలోపేతమవుతున్న భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిచిందని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, టామ్‌‌కామ్ అధికారులు నాగభారతి, అనిల్ కుమార్ పాల్గొన్నారు.