టెస్లా, లులూల్​మన్​, మాస్టర్​ కార్డ్, గూగుల్​​ టాప్

టెస్లా, లులూల్​మన్​, మాస్టర్​ కార్డ్, గూగుల్​​ టాప్

న్యూఢిల్లీ: ఫ్యూచర్​ రెడీనెస్​ లిస్ట్​లో టెస్లా, లులూల్‌మన్​, మాస్టర్​కార్డ్​, గూగుల్ ​ కంపెనీలు బెస్ట్​ కంపెనీలుగా నిలిచాయి. కరోనా మహమ్మారి తర్వాత కాలంలో ఎదగడానికి  కంపెనీలు ఎంత రెడీగా ఉన్నాయనేది స్టడీ చేసి, ఈ రిపోర్టు విడుదల చేశారు. స్విట్జర్లాండ్​కు చెందిన ఇన్​స్టిట్యూట్​ ఫర్​ మేనేజ్​మెంట్​ డెవలప్​మెంట్​ (ఐఎండీ) ఈ రిపోర్టు రిలీజ్​ చేసింది. 2010–2021 కాలానికి సంబంధించిన డేటాను స్టడీ చేసి లిస్ట్​ తయారు చేశారు. లిస్టెడ్​ కంపెనీల డేటాను మాత్రమే పరిశీలనలోకి తీసుకున్నారు. ఆయా రంగాలలోని కంపెనీలకు పోటీదారులెవరు, భవిష్యత్తులో ఆ కంపెనీలు ఎలా తట్టుకుని నిలబడతాయనేది స్టడీ చేశారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో పోటీని ఆయా కంపెనీలు ఎలా ఎదుర్కొంటాయనే అంశాన్నీ పరిశీలించారు. ఎక్కువ రెవెన్యూ వస్తున్న నాలుగు ఇండస్ట్రీలు, 89 కంపెనీలను స్టడీ చేసినట్లు ఐఎండీ తెలిపింది. ఫ్యాషన్​ అండ్​ రిటెయిల్​, ఆటోమోటివ్​, ఫైనాన్షియల్​ సర్వీసెస్​, టెక్నాలజీ రంగాలలోని కంపెనీల డేటాను విశ్లేషించినట్లు పేర్కొంది. 
ఫ్యూచర్​ రెడీనెస్​ లిస్ట్​లో ఒక్క ఇండియా కంపెనీ కూడా లేదు. 40  అమెరికా కంపెనీలు చోటు దక్కించుకోగా, చైనా, జర్మనీల నుంచి ఏడేసి కంపెనీలు, ఫ్రాన్స్​, జపాన్​ల నుంచి ఆరేసి కంపెనీలు, స్విట్జర్లాండ్​, యూకేల నుంచి రెండేసి కంపెనీలు, ఆర్జెంటీనా, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్​, సింగపూర్​, స్పెయిన్, తైవాన్​ దేశాలకు చెందిన ఒక్కో కంపెనీ లిస్ట్​లో ప్లేస్​ దక్కించుకున్నాయి.  

యూనికార్న్​ల సంఖ్యలో మొట్టమొదటిసారిగా చైనాను ఇండియా 2021లో దాటేసిందని ఫ్యూచర్​ రెడీనెస్​ ఇండికేటర్​ రూపకర్త ప్రొఫెసర్​ హోవార్డ్​ యూ చెప్పారు. ఫ్లిప్​కార్ట్​, శ్నాప్​డీల్​, ఓలా వంటి కంపెనీలు స్టార్టప్​ ఎకోసిస్టమ్​లో పెద్ద మార్పులే తెచ్చాయని పేర్కొన్నారు. చాలా మల్టీనేషనల్​ కంపెనీలను ఇండియాలోకి ఐటీ కంపెనీలు తేగలిగాయని చెప్పారు.  ప్రోబ్లమ్​ ప్రైవేటు కంపెనీలలో లేదని ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ విషయంలోనే ఇండియా వెనకబడి ఉందని తమ స్టడీలో తేలినట్లు వెల్లడించారు. ఈ విషయంలో ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకోవాలని యూ అభిప్రాయపడ్డారు. ఆటోమోటివ్​ సెక్టార్​లో టాప్​ కంపెనీలలో ఒక్కటి కూడా ఇండియా నుంచి లేదని పేర్కొన్నారు. కానీ దానికి కారణం టాటా, మహీంద్రా వంటి కంపెనీలలో ఇనొవేషన్​ లేకపోవడం మాత్రం కాదని చెప్పారు. ఆ కంపెనీలు ఇనొవేట్​ చేయగలవు...కాకపోతే రేపటి తరపు స్మార్ట్​ వెహికల్స్​ సాఫ్ట్​వేర్​, ఎలక్ట్రానిక్స్​ ఆధారంగా పనిచేసేవేనని, సిటీలలోని ఇన్​ఫ్రాస్ట్రక్చర్​తో అవి ఇంటరాక్ట్​ అవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు ఇండియాలో లేవని చెప్పారు. ఎలక్ట్రిక్​ వెహికల్స్​ జోరందుకోవాలన్నా, సూపర్​ ఛార్జర్ల నెట్‌వర్క్​ చాలా కీలకమని అభిప్రాయపడ్డారు.  చైనాలోని ఆటో​ కంపెనీలు నియో, బైడ్​లు తమ సొంత ఇనొవేషన్​ మీదే కాకుండా, ఆ దేశలలోని అడ్వాన్స్​డ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ వల్లా ప్రయోజనం పొందుతున్నాయన్నారు

ఈజ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ ముఖ్యం..
ఈజ్​ ఆఫ్​ డూయింగ్​ బిజినెస్​ చాలా ముఖ్యపాత్ర పోషిస్తుందని యూ చెప్పారు. సంస్కరణలు అమలు తర్వాత గత నలభై ఏళ్లలో ఇండియా చాలా ముందంజ వేసిందని, కానీ,  గ్లోబల్​ స్కేల్​ పోటీపడటానికి ఇంకా చాలా దూరంలో ఉందని పేర్కొన్నారు. కరోనాకు ముందు కాలంలో,  కొత్త ట్రెండ్​లను అందిపుచ్చుకున్న కంపెనీలే తమ పోటీదారులను తట్టుకుని  ముందడుగు వేశాయని తమ స్టడీలో తేలిందన్నారు. స్పోర్ట్స్​వేర్​ బ్రాండ్స్​ లులూల్​మన్, నైక్​లు మొదటి రెండు ప్లేస్​లలోనూ నిలిచాయని, ఆ తర్వాత ప్లేస్​లలో లగ్జరీ బ్రాండ్స్​ హెర్మెస్​, బర్బెర్రీ, కెరింగ్​, ఎల్​వీఎంహెచ్​లు ఉన్నాయని పేర్కొన్నారు. ఆటోమోటివ్​ సెగ్మెంట్లో టెస్లా టాప్​ ప్లేస్​లో నిలవగా, టొయోటా, బీఎండబ్ల్యూ, హ్యుండయ్​లు ఆ తర్వాత నిలిచినట్లు వివరించారు. ఫైనాన్షియల్​ సర్వీసెస్​ సెక్టార్లో మాస్టర్​ కార్డ్, వీసాలు​ మొదటి ప్లేస్​లలో ఉండగా, యాంట్​ గ్రూప్​, స్క్వేర్​, పేపాల్​లు ఆ తర్వాత ఉన్నాయని చెప్పారు. టెక్నాలజీ రంగంలో గూగుల్ ​, అమెజాన్​, మైక్రోసాఫ్ట్​, ఫేస్​బుక్​, యూఎస్​ సెమికండక్టర్​ కంపెనీ ఏఎండీలు టాప్​ ప్లేస్​లలో నిలిచినట్లు వెల్లడించారు. లిస్టులో టాప్​లోని కంపెనీలన్నీ కొత్త ట్రెండ్​లను అందిపుచ్చుకున్నాయని అన్నారు.