అటు పులుల.. ఇటు గిరిజనుల ప్రాణాలు కాపాడుడెట్ల

అటు పులుల.. ఇటు గిరిజనుల ప్రాణాలు కాపాడుడెట్ల

మహారాష్ట్ర టైగర్ జోన్ లో వందల పులులున్నా మరణాల్లేవ్

ఇక్కడ పులులు, గిరిజనుల ప్రాణాలకు రక్షణ లేదు

ట్రేస్ చేస్తే వేటగాళ్ల ఉచ్చులో పులులు చస్తయ్

చేయకుంటే మనుషులు చస్తున్నరు

ప్లానంటూ లేని ఫారెస్ట్ ఆఫీసర్లు

ఆదిలాబాద్, వెలుగు: ఓ వైపు తిండి దొరక్క పులులు అడవి దాటి వస్తున్నయ్​.. మరోవైపు  చేతికచ్చిన పంటలను కోయడానికి గిరిజనులు పొలాల్లోకి వెళ్తున్నరు.. ఈ క్రమంలో  గడిచిన వారంలోనే కాగజ్​నగర్​జిల్లాలో  పులి పంజాకు  రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసినయ్. పులులు తిరుగుతున్న విషయం ఫారెస్టోళ్లకు తెలిసినా, బయటకు చెప్పలేని పరిస్థితి! చెబితే వేటగాళ్లు వాటిని బతకనివ్వరు. ఫలానా చోట తిరుగుతున్నాయని చెప్పకుంటే ఇంకెంతమంది అమాయకులు పులులకు బలైతరో తెల్వదు. మహారాష్ట్ర టైగర్ జోన్​లో  వందల పులులున్నా  అక్కడ గిరిజనుల మరణాలుగానీ, స్మగ్లర్ల ఉచ్చులో చిక్కి  పులులు చనిపోవడం లాంటి ఘటనలు లేవు. అక్కడి మాదిరి పులుల ట్రేసింగ్​లో లేటెస్ట్​ టెక్నాలజీ వినియోగించుకోవడంలో, వన్యప్రాణుల పట్ల గిరిజనులను చైతన్యపరచడంలో మన ఫారెస్ట్​ ఆఫీసర్లు ఇంకా అప్​డేట్​అయితలేరు.

అలర్ట్​ చేయడంలో ఫెయిల్​

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 892 స్క్వేర్​ కిలోమీటర్ల కోర్​ ఏరియా,1,123 స్క్వేర్​కిలోమీటర్ల బఫర్​ ఏరియాలో  కవ్వాల్​టైగర్​రిజర్వ్​ఫారెస్ట్​విస్తరించింది. ప్రస్తుతం ఈ అడవుల్లో నాలుగు పులులు తిరుగుతున్నట్లు ఫారెస్ట్​ ఆఫీసర్లు చెబుతున్నారు. వన్యప్రాణులు.. ప్రధానంగా పులుల రక్షణ కోసం 230 మంది ఫారెస్టోళ్లు వివిధ స్థాయిలో డ్యూటీ చేస్తున్నారు. ఫారెస్ట్​లో వివిధ చోట్ల 250కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ వాటి ఆధారంగా పులులను ట్రేస్​​ చేయడంలో, గిరిజనులను అలర్ట్ చేయడంలో ఫెయిల్​ అవుతున్నారు. ఫలితంగానే గత నెల 11, 29 తేదీల్లో కాగజ్​నగర్ ఫారెస్ట్​రేంజ్​పరిధిలో సిడం విఘ్నేశ్, పసుల నిర్మల అనే ఇద్దరు గిరిజనులు పులిదాడిలో చనిపోయారు. అదే సమయంలో గడిచిన ఏడాదిన్నర కాలంలో కవ్వాల్​టైగర్​జోన్​ పరిధిలో వేటగాళ్ల ఉచ్చుకు ఏకంగా నాలుగు పులులు బలయ్యాయి. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్​లో 22 పులులు, తడోబాలో125 పులులు ఉన్నా గతేడాది పులులుగానీ, వాటివల్ల మనుషులుగానీ చనిపోయిన దాఖలాలు లేవు. కానీ ఇక్కడి ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా పులులకూ, వాటి వల్ల మనుషులకూ రక్షణ లేకుండా పోయింది.

ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు?

ఆఫీసర్లు చెబుతున్న లెక్కల ప్రకారం కవ్వాల్​ టైగర్​జోన్​లో నాలుగు పులులతో కలిపి మాంసాహార జంతువులు  175 ఉంటే  కేవలం1,353 శాఖాహార జంతువులు  మాత్రమే ఉన్నాయి. అంటే ప్రతి మాంసాహార జంతువుకు కేవలం 7 మాత్రమే శాఖాహార జంతువులు ఉన్నాయి. ఈ రేషియో చాలా చాలా తక్కువ. అందుకే మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వస్తున్న పెద్ద పులులు ఆహారం కోసం అడవి బయటికి వచ్చి గిరిజనులను చంపడమో, అవే వేటగాళ్ల ఉచ్చుకు బలవ్వడమో జరుగుతోంది. దీంతో కవ్వాల్​టైగర్​జోన్​లో గడ్డిక్షేత్రాలు, శాఖాహార జంతువుల పెంపకానికి ఏటా వస్తున్న కోట్లాది ఫండ్స్​ఏమవుతున్నాయనే ప్రశ్న వస్తోంది.  మహారాష్ట్ర అడవుల్లో లేటెస్ట్​ మెటల్​వాటర్​ట్యాంకులు వాడుతుండగా, మనదగ్గర  ఇంకా పాతకాలపు సాసర్​పిట్లనే వాడుతున్నారు. ​ పలుచోట్ల ఇవి దెబ్బతిని నీరు ఆగట్లేదు. దీంతో నీటి కోసం కూడా చేన్లు, గ్రామాలవైపు వస్తున్నాయి. సీసీ కెమెరాల్లోనూ చాలామటుకు పనిచేయడం లేదని, వాటి ఆధారంగా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంలోనూ ఫారెస్టోళ్లు ఇంకా అప్​డేట్​ కాలేదని తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వన్యప్రాణులను వేటాడేందుకు  ప్రత్యేకంగా ఓ ముఠా తిరుగుతోందని సెంట్రల్​ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బోర్డ్ రెండు నెలల క్రితం హెచ్చరించింది. స్మగ్లర్లు, వేటగాళ్ల జాడను పసిగట్టేందుకు ఆఫీసర్లు బోర్డర్​లో అలర్ట్​గా ఉండాలని  ఆదేశించింది. ఈక్రమంలో ఫారెస్ట్​, పోలీస్​ డిపార్ట్​మెంట్ల ఆధ్వర్యంలో జాయింట్ ఆపరేషన్ కు యాక్షన్​ ప్లాన్​ రూపొందించారు. ఆర్మ్​డ్ రిజర్వ్ ఫోర్స్ (ఏఆర్​)తో కలిసి  నెలపాటు కూంబింగ్​ నిర్వహించి, మధ్యలో ఆపేశారు. ఇక పులులను ట్రేస్​చేసి ఫలానా ప్రాంతంలో తిరుగున్నట్లు చెబితే వెంటనే వేటగాళ్లు దిగుతున్నారు. పులి కనిపించిన వారం, పదిరోజుల్లో దానిని ఖతం చేస్తున్నారు. అందుకే ఇన్​ఫర్మేషన్​ బయటకు చెప్పడం లేదని ఆఫీసర్లు అంటున్నారు. కానీ అదే టైంలో నమ్మకస్తులైన గిరిజన పెద్దల ద్వారా పులుల సంచారంపై పబ్లిక్​ను అలర్ట్​ చేయాలనే విషయాన్ని మరచిపోతున్నారు. వన్యప్రాణులు, పులుల రక్షణపై అడవి బిడ్డలకు అవగాహన కల్పించడం, స్మగ్లర్ల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఇన్​ఫార్మర్​ వ్యవస్థను డెవలప్​చేసుకుంటే సమస్యను చాలావరకు  పరిష్కరించే చాన్స్​ ఉన్నా మన ఫారెస్టోళ్లు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

మహారాష్ట్ర నుంచి పెద్దపులులు
మహారాష్ట్ర నుంచి వచ్చిన పెద్దపులులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ టైగర్ జోన్ తోపాటు భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లా అటవీ ప్రాంతాల్లో కొద్దిరోజులుగా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఈ క్రమంలో కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో ఇద్దరు గిరిజనులు పులిపంజాకు బలికావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిం ది. వాస్తవా నికి ఒక్కో పులి ప్రతిరోజూ 30 నుం చి 50 కిలోమీటర్లు సంచరిస్తుంది. అంటే ఒక జిల్లాలో కనిపించిన పులి ఒకటి, రెం డు రోజుల వ్యవధిలో మరో జిల్లాలో కనిపించే చాన్స్ ఉంది. వాటి మల, మూత్రాల ద్వారా, అడవుల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల ద్వారా వాటి సంఖ్యను, ఎటువైపు కదులుతున్నాయనే వివరాలను ఫారెస్ట్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు ట్రేస్ చేసి, గిరిజనులను అలర్ట్ చేయాలి. కానీ అలా చేయకపోవడం వల్లే అటవీ సమీప ప్రాంతాల్లో పొలం పనులకు వెళ్తున్న గిరిజనులు పులులకు బలైతున్నరు.