ఆ తండాకు ఆఖరి పండుగ

ఆ తండాకు ఆఖరి పండుగ

కొండపోచమ్మ రిజర్వాయర్​లో మునిగిపోనున్న తానేదార్​పల్లి తండాఇండ్లు, పొలాలను విడిచిపోతున్న గిరిజనులు..  చివరిసారిగా తండాలో కన్నీళ్లతో జాతర ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదంటారు. ఆ అనుబంధాన్ని ఉన్నట్టుండి తెంచుకొని వెళ్లిపోవడం ఎవరితరం కాదు. సిద్దిపేట జిల్లాలోని తానేదార్​పల్లి తండావాసుల తరం కూడా కాలేదు.  కొండపోచమ్మ రిజర్వాయర్​ కింద ఈ తండా మునిగిపోనున్నది. తండాను వదిలి, తమకు కేటాయించిన ప్రాంతానికి వెళ్లాల్సి రావడంతో.. అక్కడి జనమంతా  తండాలో చివరి పండుగ జరుపుకున్నారు. జాతర చేసుకున్నారు. ఆడబిడ్డలను, చుట్టాలను పిలుచుకొని భోజనాలు పెట్టారు. కుల దైవాలకు ప్రత్యేక పూజలు జరిపారు. తండాను వదిలిపోతున్నందుకు
గొడగొడ ఏడ్చారు.

సిద్దిపేట, వెలుగుకొండపోచమ్మ రిజర్వాయర్​లో సిద్దిపేట జిల్లా ములుగు మండలం తానేదార్​పల్లి తండా ముంపునకు గురవుతోంది. తండాలో మొత్తం 76 ఇండ్లలో 84 కుటుంబాలకు చెందిన 283 మంది గిరిజనులు ఉంటారు. ఈ తండాతోపాటు ఇక్కడివారికి చెందిన 580 ఎకరాల భూములు పూర్తిగా మునిగిపోతున్నాయి. దీంతో వీరికి పరిహారం చెల్లించిన ఆఫీసర్లు.. ఇదే మండలం తునికి బొల్లారంలోని ఆర్ అండ్ ఆర్  కాలనీలో  డబుల్  బెడ్  రూమ్  ఇండ్లను కేటాయించారు. తాజాగా తండాను ఖాళీ చేయాలంటూ ఆఫీసర్లు ఆదేశాలు జారీ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో గిరిజనులు సామాన్లు సర్దుకొని భారంగా ఊరిని వదిలి వెళ్తున్నారు. ఇప్పటికే కొందరు వెళ్లిపోగా.. మరికొందరు ఈ రెండు, మూడురోజుల్లో వెళ్లేందుకు రెడీ అయ్యారు.

చుట్టాలను పిలుచుకొని..

గిరిజనులు మూడు రోజులుగా తండాలో చివరి జాతర జరుపుకున్నారు. ఏటా ఈ జాతరను ఆనందోత్సాహాల నడుమ చేసుకోగా, ఈసారి మాత్రం కన్నీళ్ల నడుమ చేసుకున్నారు. సోమవారం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని.. జ్ఞాపకాలను యాదికితెచ్చుకొని ఏడ్చారు. చివరి జాతరకు అన్ని కుటుంబాలు.. చుట్టాలను ఆహ్వానించాయి. కులదైవాలైన వెంకటేశ్వరస్వామి, తుల్జా భవానీ మాత, హతిరాంబాబాకు గిరిజనలు ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడి హనుమాన్  విగ్రహానికి  చందనం వేయించి, హోమాలు నిర్వహించారు.

ఈ మట్టిని మరవలేమంటూ..

తండావాసులు ప్రతి ఇంటి ముందు రెండు చిన్న గుంతలు తవ్వి, అట్ల వచ్చిన మట్టిని కుప్పగా పోశారు. ఆ గుంతల్లో పొయ్యి వెలిగించి, ఒక పొయ్యి పై అన్నం, మరో పొయ్యి పై బియ్యం పిండి రొట్టెలను కాల్చి, పిసికి, మలీదముద్దలు చేశారు. గుంత ముందు పోసిన మట్టిని డొల్లగా చేసి, అన్నం వండగా వచ్చిన గంజిని అందులో పోశారు. అనంతరం పొయ్యిల ముందు వెంకన్నస్వామి ఫొటోలతోపాటు విలువైన సామాగ్రిని ఉంచి, రొట్టె తో చేసిన మలీదముద్దలు, అన్నం, పప్పుతో నైవేద్యాలను సమర్పించారు. తండావాసులంతా నొసటిపై, చేతులపై, కనుబొమ్మలపై ప్రత్యేకమైన బొట్లు పెట్టుకొని పూజల్లో పాల్గొన్నారు. వండిన ప్రసాదాలలో కొంత భాగాన్ని అగ్నికి సమర్పించి, మిగిలిన ప్రసాదాన్ని స్వీకరించారు.

పానం పోయినట్టయితాంది

చావైనా, బతుకైనా తండాలోనే అనుకున్నం. కానీ ఇట్ల తండాను వదిలిపోవాలంటే పానం పోయినంత పనైతాంది.  నలుగురు కొడుకులతో ఊరిలో వ్యవసాయం చేసుకుంట బతికెటోళ్లం. ఇప్పుడు ఆ భూములన్నీ ప్రాజెక్టుకు ఇచ్చినం. కొత్త జాగలో మా బతుకుదెరువు ఎట్లుంటదో?  ఆలోచిస్తే భయమైతాంది. మా బతుకులు ఆగంలో పడ్డయి. మా ఉపాధి కోసం బర్లు, గొర్లు ఇప్పించాలని సీఎం సారును కోరుతున్నం.

– సాయనిమ్మ, తానేదార్ పల్లి తండా

పుట్టినప్పటి నుంచి ఊరిడిచి ఉండలే..

పుట్టిపెరిగిన ఇన్నేండ్లలో ఎన్నడూ ఊరు విడిచి ఉండలే. మా తాతల కాలం నాటి ఇండ్లు, భూములు వదిలిపోవాలంటే గుండె తరుక్కుపోతాంది. పిల్లల్ని ఊల్లనే ఉండి బతుకమన్నం. ఇప్పుడు అందరం కలిసి వేరే జాగలకు పోతున్నం. ఈ తండాలోనే చచ్చిపోదమనుకున్న. మా తాతలు కలిసిన ఈ మట్టిలోనే కలిసిపోదమనుకున్న. కానీ ఇప్పుడు ఎక్కడికో పోయి చావాల్సివస్తాంది. కొన్ని నెలల సంది కంటిమీద కునుకు లేదు. మా బాధలు భగవంతుడికే తెలుసు.- భదవత్ శ్రీనివాస్ నాయక్, తానేదార్​పల్లి తండా

కుటుంబాలన్నీ రోడ్డున పడ్డయి

ప్రాజెక్టు వల్ల మా ఊల్ల కుటుంబాలన్నీ  రోడ్డు నపడ్డయి. ఇప్పటిదాకా ఇల్లు, భూమి ఉందనే నమ్మకంతో బతికినం. ఇప్పుడిక మాకు ఏమీ లేదు. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం.. ఒకటి, రెండేండ్లల్ల ఒడుస్తది. అప్పుడు ఎట్ల బతకాలె? యాదికితెచ్చు కుంటెనే కన్నీళ్లు ఆగుతలేవు. చచ్చినా బతికినా ఊరిలోనే ఉంటామనుకొని కొత్త ఇల్లు కట్టు కున్నం. ఇప్పుడు ఆ ఇల్లునూ, ఈ ఊరిని ఇడిసిపెడుతున్నం. తండాలో మస్తుమంది చదువురానోళ్లే.  మాకు బతికే దారిని సర్కారే చూపాలే. – విజయ, తానేదార్​పల్లి ఉద్యోగాల ఆశ చూపి యువతులకు ట్రాప్

మహిళల ఫిర్యాదుతో  నిందితుడి అరెస్టు

మందమర్రి, వెలుగు: ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆశ చూపి వందలాది మంది యువతులను ట్రాప్ చేశాడో కేటుగాడు.  ఉట్నూర్​ మండలం సాంపూర్​కు చెందిన కునమల్ల శ్రీనివాస్‌‌ కలెక్టర్ సీసీనంటూ పరిచయం చేసు కుని ఆశ వర్కర్లు, అంగన్​వాడీ సిబ్బంది,  యువతులు, మహిళలకు ఉద్యోగం ఇప్పిస్తానని, పర్మనెంట్ చేయిస్తానని నమ్మించి.. న్యూడ్‌‌ ఫోటోలు పంపాలని, వాట్సాప్ వీడియో కాల్స్ చేయాలనేవాడు. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు రెండువేల మంది అతని ప్రలోభాలకు గురయ్యారు. ఆ తర్వాత రికార్డు చేసిన ఫోటోలు, వీడియోల ద్వారా బ్లాక్​మొయిల్​కు పాల్పడేవాడు.  మందమర్రికి చెందిన ముగ్గురు మహిళలు షీ టీం దృష్టికి తీసుకవెళ్లగా మందమర్రి పోలీసులు శ్రీనివాస్​ను పట్టుకున్నారు.

మరన్ని వార్తల కోసం..