కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ పదవికి సామ్ పిట్రోడా రాజీనామా

కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ పదవికి సామ్ పిట్రోడా రాజీనామా

కాంగ్రెస్ పార్టీ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి సామ్ పిట్రోడా బుధవారం (మే 8) రాజీనామా చేశారు. ఇటీవల ఆయన భారతీయుల చర్మం రంగుపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన రాజీనామాను ఏఐసీసీఐ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెంటనే ఆమోదించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఒక పోస్ట్‌లో తెలిపారు. 

"మిస్టర్ సామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన నిర్ణయాన్ని అంగీకరించారు.." అని జైరాం రమేష్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్‌ చేశారు.

దక్షిణాది వారు ఆఫ్రికన్లలా కనిపిస్తారు

వారసత్వ పన్నుపై.. ఇటీవల కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం పిట్రోడా దానిపై మాట్లాడుతూ కొత్త వివాదానికి తెరలేపారు. భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా అభివర్ణించే క్రమంలో జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. "తూర్పు భారతీయులు చైనీయుల్లాగా.. పశ్చిమ భారతీయులు అరబ్బులాగా.. ఉత్తరాది పౌరులు శ్వేత జాతీయుల్లాగా.. దక్షిణాది వారు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారని అన్నారు.." ఈ వ్యాఖ్యలపై అన్ని వర్గాల వారి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.