మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ.. భారీ స్థాయిలో కీలక మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ.. భారీ స్థాయిలో కీలక మావోయిస్టుల లొంగుబాటు

హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్తో ఇప్పటికే భారీగా నష్టపోయిన మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. భారీ స్థాయిలో మావోయిస్టుల లొంగిపోతున్నట్లు తెలిసింది. తెలంగాణ DGP శివధర్ రెడ్డి ముందు సరెండర్ అవ్వాలని మావోయిస్టులు నిర్ణయించుకున్నారు. కీలక మావోయిస్టులూ లొంగిపోనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో పాటు ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ ఫలితం వల్లే మావోయిస్టులు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. 

టాప్ క్యాడర్లు కూడా లొంగిపోనున్నారు. మావోయిస్టులు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులే లొంగుబాట్లకు సంకేతం. లొంగిపోయే మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ సిద్ధం చేసింది. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న సరిహద్దుల్లో భద్రతా బలగాలు మరింత కట్టుదిట్టంగా ముందుకెళుతున్నాయి.

ఇదిలా ఉండగా.. మావోయిస్టుల లొంగుబాటుపై సాయంత్రం 3 గంటలకు ప్రెస్ మీట్లో డీజీపీ వివరాలు వెల్లడించనున్నారు. 37 మంది మావోయిస్టులు ఇప్పటికే లొంగిపోయినట్లు తెలిసింది. లొంగిపోయిన వారిలో అజాద్, అప్పాసి నారాయణ, ఎర్రాలు ఉన్నట్లు సమాచారం. లొంగిపోయిన వారిలో కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఉండటంతో తెలంగాణలో మావోయిస్టుల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ముందుముందు మరింత మంది మావోయిస్టులు లొంగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.

నంబాల కేశవ​రావు, హిడ్మా ఎన్​కౌంటర్లు.. ఇలా కీలక నేతల లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ క్రమంలోనే చత్తీస్‌గఢ్‌ నుంచి ఏపీలోకి ప్రవేశించిన 27 మందిని విజయవాడలో ఏపీ ఇంటెలిజెన్స్‌ అధికారులు మంగళవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నది. తెలంగాణ కేడర్‌కు చెందిన 64 మంది మావోయిస్టులు లొంగిపోయి ప్రజలకు సేవ చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చారు.

ఈ మేరకు అండర్‌‌ గ్రౌండ్‌ కేడర్‌‌లో ఉన్న సెంట్రల్ కమిటీ మెంబర్‌‌ సుజాతక్కసెప్టెంబర్‌‌ 13న లొంగిపోగా.. మరో కీలక నేత సెంట్రల్ కమిటీ మెంబర్‌‌ పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న అక్టోబర్‌‌ 29న జనజీవన స్రవంతిలో కలిశారు. వీరి తరహాలోనే మరో 37 మంది మావోయిస్టులు ఇప్పటికే లొంగిపోవడం గమనార్హం.