నల్లా కనెక్షన్లకు మీటర్లు బిగించడంలో కాంట్రాక్టర్ లేట్ ​చేస్తున్నడు

నల్లా కనెక్షన్లకు మీటర్లు బిగించడంలో కాంట్రాక్టర్ లేట్ ​చేస్తున్నడు

 

  •      కంటోన్మెంట్ పరిధిలో వచ్చే నెల 1వరకు డెడ్ లైన్
  •     మరో 2 నెలలు గడువు కోరుతున్న స్థానికులు
  •     6 నెలలుగా పూర్తికాని మీటర్ల ఏర్పాటు

కంటోన్మెంట్, వెలుగు: జీహెచ్ఎంసీతో పాటు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అమలు చేస్తున్న ఫ్రీ వాటర్ స్కీం(20 వేల లీటర్లు) పొందేందుకు అధికారులు అక్టోబరు1వరకు డెడ్​లైన్ విధించారు. ఆ లోపు నల్లా కనెక్షన్లకు తప్పనిసరిగా మీటర్లు బిగించుకోవాలని స్పష్టం చేశారు. అక్టోబరు 2 తర్వాత ఎరియర్స్ తోపాటు నల్లా బిల్లు చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మీటర్ల ఏర్పాటులో కాంట్రాక్టర్​జాప్యం చేస్తున్నారని, నిర్ణీత గడువులో ఏర్పాటు సాధ్యం కాదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు నెలలు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

రెండేళ్ల తర్వాత..

జీహెచ్ఎంసీ పరిధిలో 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకం అమల్లోకి వచ్చి రెండేళ్లు అవుతుండగా మొన్నటి దాకా కంటోన్మెంట్​పరిధిలో అమలు చేయలేదు. మొత్తం 32 వేల 364 నల్లా కనెక్షన్లు ఉండగా, వీటిలో16 వేల కనెక్షన్లు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బస్తీలలో ఉన్నాయి. మిగిలినవి కాలనీల్లో ఉన్నాయి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు నెలకు రూ.214  నల్లా బిల్లు చెల్లిస్తుండగా, కాలనీల్లో ఉండేవారు నెలకు రూ.450 వరకు నల్లా బిల్లు చెల్లిస్తున్నారు. ఫ్రీ వాటర్​స్కీం కోసం స్థానికులు పలుమార్లు నిరసనలు తెలిపి వినతిపత్రాలు అందజేయగా ఈ ఏడాది మార్చి2న ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇచ్చింది. దాని ప్రకారం నల్లా కనెక్షన్​కు మీటరు తప్పనిసరిగా ఉండాలి. అయితే రూ.250 బిల్లు వచ్చేవారు ఎలాంటి మీటరు బిగించుకోవాల్సిన అవసరం లేదు. నెలకు రూ.450, అంతకంటే ఎక్కువ బిల్లులు చెల్లిస్తున్నారో వారు తప్పకుండా నల్లా కనెక్షన్​కు మీటర్​బిగించుకోవాల్సి ఉంటుంది. బోర్డుకు రూ.1,500 చెల్లిస్తే కాంట్రాక్టర్​మీటరు ఏర్పాటు చేస్తారు. ఈ విషయాన్ని  ఆరు నెలలుగా చెబుతున్నా ఇప్పటికీ చాలా మంది మీటర్లు ఏర్పాటు చేసుకోలేదు. మీటర్లు లేకుంటే బకాయిలతోపాటు బిల్లు వసూలు చేస్తామని కంటోన్మెంట్​బోర్డు అధికారులు ఇప్పటికే 3సార్లు నోటీసులు ఇచ్చారు. చివరిగా విధించిన గడువు ఈ నెల15తో ముగిసింది. అయినా ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు. మరో అవకాశం ఇస్తూ గడువును అక్టోబరు1 వరకు పెంచారు. అక్టోబరు 2 తర్వాత మీటర్లు బిగించుకోని పక్షంలో ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు ఉన్న వాటర్​బిల్లుల బకాయిలతోపాటు నెలకు వచ్చే నల్లా బిల్లు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తర్వాతే మీటర్ల ఏర్పాటుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. బోర్డులో బీపీఎల్​నల్లా కనెక్షన్లు పోను మిగిలిన 16వేల 364 కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆ పనిని అధికారులు ఒక్క కాంట్రాక్టర్​కే అప్పగించారు. సదరు కాంట్రాక్టర్ వద్ద సిబ్బంది లేరని, మరో వైపు మీటర్లు అందుబాటులో లేకపోవడంతో బిగింపు లేట్​అవుతోందని స్థానికులు అంటున్నారు.

మరో 2 నెలలు టైం ఇవ్వండి

నల్లా కనెక్షన్లకు మీటర్లు బిగించడంలో కాంట్రాక్టర్ లేట్ ​చేస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది ఏర్పాటు చేసుకోలేదు. అక్టోబర్ 1లోగా ప్రతిఒక్క ఇంట్లో ఏర్పాటు సాధ్యం కాదు. ప్రభుత్వం మరో 2 నెలలు గడువు ఇవ్వాలి. లేకుంటే చాలా మంది నష్టపోతారు. అలాగే మీటర్ల ఏర్పాటును త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి.
 -తేలుకుంట సతీశ్​గుప్తా, కంటోన్మెంట్