రికార్డు ధర ఉన్నా పత్తి రైతుకు ఫాయిదా లేదు

రికార్డు ధర ఉన్నా పత్తి రైతుకు ఫాయిదా లేదు

ఖమ్మం/ఆదిలాబాద్, వెలుగు: పత్తికి రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నా రైతన్నల మోములో ఆనందం మాత్రం కనిపించడం లేదు. ధర ఎక్కువగా ఉన్నా దిగుబడి తగ్గడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. ప్రస్తుతం పత్తి క్వింటాల్​కు రూ. 8,500 పైనే ధర నడుస్తోంది. కానీ మార్కెట్​కు అనుకున్నంత పత్తి రావడం లేదు. ఇప్పటివరకు ఉమ్మడి ఆదిలాబాద్​లో మార్కెట్​కు వచ్చిన పత్తి కేవలం 90 వేల క్వింటాళ్లు మాత్రమే. ప్రతి సంవత్సరం ఈ సమయానికి కనీసం 4 లక్షల క్వింటాళ్లకుపైనే పత్తి మార్కెట్​కు వచ్చేది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్​లో దాదాపు నెల నుంచి పత్తి అమ్మకానికి వస్తోంది. మద్దతు ధరకు దాదాపు రూ.2 వేలు ఎక్కువగా రూ.8 వేలకు పైగా క్వింటా పత్తి రేటు ఉంది. అత్యధికంగా రూ.8,500 వరకు రేటు పలికింది. మంచి రేటు ఉన్నా దిగుబడి తగ్గడంతో లాభం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. 

సాగూ తగ్గింది
ఈ వానాకాలం సీజన్‌‌‌‌లో రాష్ట్రవ్యాప్తంగా 49.97లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. గతేడాదితో పోలిస్తే ఇది 10.56 లక్షల ఎకరాలు తక్కువ. కాగా సీజన్​ ప్రారంభంలో, సెప్టెంబరులో  కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతిన్నది. ఎకరానికి కనీసం 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా ఐదారు క్వింటాళ్లకు మించి రావడం లేదు. గతేడాది పత్తికి డిమాండ్​ లేకపోవడంతో క్వింటా రేటు రూ. 4 వేల నుంచి రూ. 6 వేల మధ్య పలికింది. అదే సమయంలో మిర్చికి క్వింటాకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.21 వేలకు పైగా రేటు పలకడంతో చాలామంది రైతులు ఈసారి పత్తి నుంచి మిర్చి పంట సాగుకు ఆసక్తి చూపించారు. ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లాలో 10,02,657 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. వాతావరణం అనుకూలంగా ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అయితే ఈసారి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చిన వానల కారణంగా ఎక్కువ రోజులు వర్షపు నీటిలో మొక్కలు ఉండడంతో దిగుబడిపై ప్రభావం పడిందని రైతులు అంటున్నారు. ఇక వర్షాధారంగా పండించే రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లాలో 40 % మంది రైతులు వర్షాధారంగా పత్తి పండిస్తారు. వీరికి దిగుబడి మూడు నుంచి నాలుగు క్వింటాళ్లకు మించడం లేదు. దిగుబడి తగ్గడంతో మార్కెట్లో పత్తికి మంచి రేటు పలుకుతోంది. 

లద్దెపురుగుతో నష్టపోయా
రెండు ఎకరాల్లో పత్తి సాగు చేశా. మొదటిసారి పత్తి ఏరితే నాలుగు క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. చేలో మొత్తం లద్ది పురుగు పడడం, పత్తి పూలు, కాయలను నాశనం చేస్తుండడంతో మందులు కొట్టా. క్వింటా రూ.7,400 చొప్పున మొదటి పంట అమ్మా. ఇక వచ్చే పత్తి అయినా ఎక్కువ దిగుబడి వస్తుందేమో చూడాలి.  

– ఐల నరేశ్, వేపకుంట్ల, రఘునాథపాలెం మండలం, ఖమ్మం

రెండెకరాలకు రెండున్నర క్వింటాళ్లు
ఈ సంవత్సరం రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశా. మొదటిసారి పత్తి రెండున్నర క్వింటాలు వచ్చింది. గత సంవత్సరం మూడు ఎకరాల సాగు చేస్తే మొత్తం 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం ముందుగా వర్షాలు రావడం, చెట్టు ఎరుపు రంగుకు మారడంతో దిగుబడి పడిపోయింది. 
– సాదినేని శేషగిరిరావు, కౌలు రైతు, ముదిగొండ, ఖమ్మం