మునుగోడులో దుకాణాలు వెలవెల

మునుగోడులో దుకాణాలు వెలవెల

మునుగోడు నియోజకవర్గం నిన్న మొన్నటిదాకా గల్లీ గల్లీల్లో జనం.. నేతల ప్రచారాలతో హోరెత్తిపోయింది. ఎప్పుడైతే పోలింగ్ ముగిసిపోయిందో.. అప్పటి నుంచి అంతా గప్ చుప్ గా మారిపోయింది.గెలుపు కోసం ప్రధాన పార్టీల నేతలు ఇంఛార్జ్ లు వారివారి పార్టీల అనుచరులతో వేలాది మంది మునుగోడులో మకాం పెట్టారు. పెద్ద పెద్ద నాయకులు గడప గడప తిరుగుతూ జోరుగా ప్రచారం చేశారు. ఇంచార్జ్ లు ఉండడానికి నెలకు ఇంటి కిరాయిలు లక్షలలో వసూలు చేశారు యజమానులు. హోటల్స్, బాంకెట్ హాల్స్, ఫంక్షన్ హాల్స్ సమావేశాల కోసం లక్షల రూపాయలు పెట్టి  నాయకులు బుక్ చేసుకున్నారు. హోటల్స్, టీ షాపుల్లో ఇన్ని రోజులు నిలబడడానికి కూడా చోటు లేని పరిస్థితి కనిపించింది. 

మందు, మటన్, చికెన్ దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు రోజూ కిటకిటలాడాయి. సుక్క ముక్క ముట్టని రోజులంటూ లేకుండా ఉప ఎన్నికల పర్వం కొనసాగింది. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం ఎటు చూసినా ఖాళీగా కనిపిస్తోంది. జనసంచారం ఒక్కసారిగా మాయమైంది. నిన్న మొన్నటి వరకు కిటకిటలాడిన దుకాణాలు ఇప్పుడు వెలవెల బోతున్నాయి. రోజూ పెద్ద ఎత్తున గిరాకీ జరిగిన షాపులకు గిరాకీ ఒక్కసారిగా పడిపోయింది. కౌంటర్ లు ఖాళీగా కనిపిస్తున్నాయి. బైపోల్ రావడంతో గిరాకీ బాగానే జరిగిందని దుకాణదారులు అంటున్నారు.