నెలరోజుల పాటు వైభవంగా జరిగిన గోల్కొండ బోనాల జాతర

నెలరోజుల పాటు వైభవంగా జరిగిన గోల్కొండ బోనాల జాతర

మెహిదీపట్నం, వెలుగు: నెల రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన గోల్కొండ బోనాల జాతర గురువారంతో ముగిసింది. గోల్కొండ కోటపై ఉన్న  శ్రీ జగదాంబిక మహంకాళి (ఎల్లమ్మ) అమ్మవారి బోనాల జాతర గత నెల 30న మొదలవగా.. నెల రోజుల పాటు ప్రతి ఆది, గురు వారాల్లో తొమ్మిది పూజలు జరిగాయి. ఈ బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈసారి సుమారు 10 లక్షలకుపైగానే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరాజు, కమిటీ చైర్మన్ మహేశ్వర్ తెలిపారు. ఎంతో మంది మహిళలు బోనాలను సమర్పించారన్నారు.

గురువారం ఉదయం 9వ పూజ జరిగిందని మహేశ్వర్ తెలిపారు. చివరి పూజ కావడంతో  భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి మొక్కులు  చెల్లించుకున్నారన్నారు. గతేడాది రూ.5 లక్షల 20 వేలు హుండీ ఆదాయం వచ్చిందన్నారు. ఈ ఏడాది 7 పూజలకు గాను 3 సార్లు హుండీని లెక్కించగా మొత్తం రూ.8 లక్షల 10 వేల ఆదాయం వచ్చిందన్నారు. అమ్మవారికి వెండి నగలు కూడా కానుకల రూపంలో వచ్చాయన్నారు. మిగతా రెండు పూజల హుండీ లెక్కింపు సోమవారం నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పోలీసులు, ఇతర అధికారులకు ఆలయ కమిటీ చైర్మన్ మహేశ్వర్ ధన్యవాదాలు తెలిపారు.