బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవటం చాలా సులువు. బ్యాంకుల నుంచి ప్రైవేటు కంపెనీల వరకూ ఈ సెక్యూర్డ్ లోన్స్ ఇచ్చేందుకు ఎక్కువగానే ఆసక్తి చూపుతుంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇలా పెద్ద మెుత్తంలో గోల్డ్ లోన్స్ తీసుకున్న వారు తిరిగి చెల్లించలేక డిఫాల్ట్ అవుతున్నట్లు తేలింది. దీంతో బ్యాంకులు కూడా గోల్డ్ లోన్స్ గతంలో మాదిరిగా కాకుండా కొంచెం ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాయ్.
పిరమల్ ఫైనాన్స్ ఎండీ, సీఈఓ జైరామ్ శ్రీధరన్ ఇటీవల వెల్లడించిన అంశాలు భారత ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులకు అద్దం పడుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన ఆస్తుల విలువను రూ.లక్ష కోట్లకు చేర్చుకోవడమే కాకుండా.. లాభాలను 3 రెట్లు పెంచుకుని రూ.15వందల కోట్లకు తీసుకెళ్లింది. క్రెడిట్ రేటింగ్ కూడా AA నుండి AA+కి మెరుగుపడటం గమనార్హం. అయితే ఈ విజయాల కంటే ముందున్న సవాళ్లు ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా క్రూడ్ ధరలు, మారుతున్న వినియోగదారుల ప్రవర్తన లోన్స్ ఇస్తున్న కంపెనీలను, బ్యాంకులను అప్రమత్తం చేస్తున్నాయి.
భారతీయుల్లో పొదుపు అలవాట్లు భారీగా మారుతున్నాయని పేర్కొన్నారు. గతంలో మాదిరిగా ప్రజలు సేవింగ్స్ ఖాతాలు లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో డబ్బును ఉంచడం లేదని.. నేరుగా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్‌లోకి పెట్టుబడులను మళ్లిస్తున్నారని చెప్పారు. దీనివల్ల బ్యాంకుల వద్ద డిపాజిట్ల వృద్ధి తగ్గి, రుణాల మంజూరు కష్టతరమవుతుంటే, క్యాపిటల్ మార్కెట్‌పై ఆధారపడే ఎన్‌బిఎఫ్‌సిలకు ఇది కలిసి వస్తోంది. అదే సమయంలో యువతలో రుణాలు తీసుకోవడం పట్ల ఉన్న భయం పోయిందని, ఇది హౌస్‌హోల్డ్ బ్యాలెన్స్ షీట్‌లపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ALSO READ : మోడీ ఇచ్చిన షాక్: ఒక్కరోజే రూ.14వేలు పెరిగిన తులం బంగారం..
గోల్డ్ లోన్స్ పరిస్థితి..
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గోల్డ్ లోన్ కేటగిరీలో కనిపిస్తున్న వింత ధోరణి. సాధారణంగా చిన్న రుణాల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుందని బ్యాంకింగ్ సంస్థలు భావిస్తాయి. కానీ గోల్డ్ లోన్లలో మాత్రం రూ. 2లక్షల 50వేల కంటే ఎక్కువ రుణాలతో రిస్క్ ఎక్కువగా ఉందని శ్రీధరన్ వెల్లడించారు. చాలామంది తమ వ్యాపారాల కోసం ఇంట్లోని ఆభరణాలను తాకట్టు పెడుతున్నారని.. వ్యాపారాలు దెబ్బతిన్నప్పుడు ఆ గోల్డ్ లోన్ తీర్చలేకపోతున్నారని చెప్పారు. ఇలాంటి మార్పులను గమనిస్తూ.. రాబోయే రోజుల్లో ఎవరికి గోల్డ్ లోన్ ఇస్తున్నాం అనే విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటామన్నారు. దీన్ని చూస్తుంటే ఆర్థిక వ్యవస్థలో పైన అంతా బాగున్నట్లు కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం ఒత్తిడి పెరుగుతోందని అర్థమవుతోంది. సో గోల్డ్ లోన్స్ డిఫాల్ట్ కూడా పెరుగుతోందని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
