మహానగరాలలో పర్యావరణ పరిరక్షణ కోసం డీజిల్ బస్సులను తగ్గించటం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించాలన్న సంకల్పంతో రాష్ట్రాలకు ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అయితే, వీటి సరఫరా, నిర్వహణ, కాంట్రాక్టు.. ప్రైవేట్ సంస్థలకు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని కూడా ఆ సంస్థలకే ఇస్తున్నది.
ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా ఆర్టీసీ సంస్థకే ఇస్తూ సబ్సిడీని కూడా ఆర్టీసీకే ఇవ్వాలని రాష్ట్రం కోరుతున్నప్పటికీ కేంద్రం అంగీకరించడం లేదు. ఇది ఒక రకంగా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను ప్రోత్సహించేవిధంగా ఉంది. ఇది ఆర్టీసీలను నిర్వీర్యం చేయడమే అవుతుంది.
ఇది ఎంతవరకు సమంజసమని కార్మిక సంఘాల నుంచి ఆందోళన, ఆవేదన వ్యక్తమవుతున్నది.
కేంద్రం ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చే విధానాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం ఎలక్ట్రిక్ బస్సుల కోసం గత బడ్జెట్లో పీఎం ఈ– డ్రైవ్ (పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ హెవీకల్ ఎన్హాన్స్మెంట్) పథకం ప్రవేశపెట్టింది. దీనికోసం మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ఎలక్ట్రిక్ బస్సుల కోసం దాదాపు రూ.1.14 లక్షల కోట్ల నిధులను ప్రైవేట్ సంస్థలకే అప్పజెప్పుతున్నారు.
సబ్సిడీ నిధులు ప్రైవేట్ సంస్థలకు..
ఈ పథకం కింద తెలంగాణ ఆర్టీసీకి కేంద్రం తాజాగా 2,000 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసింది. బస్సుకు రూ. 25 లక్షల చొప్పున రూ. 500 కోట్ల సబ్సిడీనీ ప్రైవేట్ సంస్థలకే అప్పజెప్పింది. ఇప్పటికే హైదరాబాదులో 525 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. ఇంకొక 400కు పైగా జిల్లాలలోని వివిధ డిపోలకు కేటాయించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్యం నియంత్రణ ద్వారా శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు నివారించవచ్చని ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్ బస్సులను పూర్తిగా తగ్గించి ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2027 చివరినాటికి భారీ సంఖ్యలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 2800 ఎలక్ట్రిక్ బస్సులు తిప్పాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకు 19 ఆర్టీసీ డిపోలలో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేపట్టారు. వీటన్నింటి కోసం రూ. 325 కోట్లు ఖర్చు అవుతుందని సర్కార్ అంచనా వేసింది. హయత్ నగర్ బస్ డిపో-2 పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు, హెచ్ సీయూ, మియాపూర్ తోపాటు ప్రతి డిపోలో 15 నుంచి 25 వరకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచుతున్నారు.
డీజిల్ బస్సులను ఈ -బస్సులుగా..
ఆర్టీసీకి చెందిన డీజిల్ బస్సులను రెట్రో ఫిట్మెంట్ ప్రక్రియ ద్వారా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు టెండర్లు పిలిచారు. ఇందుకోసం ప్రతి బస్సుపై రూ. 50 లక్షలు ఖర్చు అవుతుందని 2027లోగా పూర్తి బస్సులను ఈ -బస్సులుగా మార్చాలని ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది. ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడానికి, ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఆర్టీసీ కార్మికసంఘాలు స్వాగతిస్తున్నాయి. అయితే, ఈ ప్రక్రియ మొత్తం ప్రైవేటు సంస్థల ద్వారా కాకుండా ఆర్టీసీ ద్వారా చేయాలని కోరుతున్నారు.
ఎలక్ట్రిక్ బస్సులను ప్రస్తుతం గ్రాస్ కాస్ట్ కాంటాక్ట్ (జీసీసీ )విధానంలో కొనుగోలు చేస్తున్నారు. టెండర్ల ద్వారా దీన్ని అమలు చేస్తున్నారు. ఒక్కొక్క ఎలక్ట్రిక్ బస్సు కొనాలంటే రూ. కోటిన్నర వరకు ఖర్చవుతుంది. అంత మొత్తం భరించటం ఆర్టీసీకి, రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా ఉంటుంది. ఒక్కొక్క బస్సుకు సగటున రూ. 25 లక్షల సబ్సిడీని కేంద్రం ప్రకటించింది. ఈ సబ్సిడీ ప్రస్తుతం ప్రైవేట్ ఆపరేటర్లకు ఇస్తోంది.
బస్సులను కొనుగోలు చేయడం వాటికి డ్రైవర్లను సమకూర్చడం, నిర్వహణ చేయడం చార్జింగ్ స్టేషన్స్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం తదితర చర్యలు తీసుకోవడం చేయాలి. ప్రస్తుతం ఆర్టీసీకి పూర్తి నిర్వహణ వ్యవస్థ ఉన్నది. కేంద్ర ప్రభుత్వ విధానం ఆర్టీసీకి ఇవ్వకుండా ప్రైవేట్ సంస్థలకు సబ్సిడీ ఇస్తూ వారికే బస్సులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం.
ఆదాయం తక్కువ.. ఖర్చు ఎక్కువ
ఆర్టీసీలు కిలోమీటరుకు ఇంత అని రేటు ఫిక్స్ చేసి ఎలక్ట్రిక్ బస్సులను వాడుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ విధానం. ఈ విధానం ద్వారా స్థానిక ఆర్టీసీలకు ఎలాంటి లాభం ఉండదు. ప్రస్తుతం హైద రాబాదులో ఓఆర్ఆర్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయి. వీటి ద్వారా కొన్ని అనుభవాలు వచ్చాయి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ అవుతుందని తేలింది.
ఎలక్ట్రిక్ బస్సులకు తాజా లెక్కల ప్రకారం రోజుకు కిలోమీటరుకు వచ్చే ఆదాయం రూ.58 నుంచి రూ. 60 లుగా ఉంటున్నది. కానీ ప్రైవేట్ ఆపరేటరుకు కిలోమీటరుకు రూ. 63 చెల్లించాలి. రోజువారీగా వచ్చే ఆదాయంతో సంబంధం లేదు.. ఇందుకుగాను టెండరులో కోట్ చేసిన ధర ప్రకారం ఆర్టీసీ చెల్లించాల్సి ఉంటుంది.
ఎలక్ట్రిక్ బస్సులకు ప్రైవేట్ కాంట్రాక్టర్లే డ్రైవర్లను సమకూర్చుకుంటున్నారు, సూపర్వైజర్లు, క్వాలిటీ కంట్రోలర్, ప్రైవేట్ సిబ్బందిని నియమించుకుంటున్నారు. ఒక బస్సుపైన యావరేజ్‌గా అయిదుగురు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంది. 2000 బస్సులు అంటే పదివేల మంది ఉద్యోగాలు ఆర్టీసీ సంస్థలో
కోల్పోతారు. ప్రస్తుతం ఉన్న డిపోలు, స్థలాలు ప్రైవేట్వారికు అప్పజెప్పటం జరుగుతుంది. ఆర్టీసీ సంస్థ కిలోమీటరుకు రూ.60 నుంచి రూ. 63 చొప్పున ప్రైవేటు వారికి అప్పగించటంతో ఆర్టీసీ నిర్వీర్యం అవుతుందని కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
- ఉజ్జిని రత్నాకర్ రావు,ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు-
NOTE : ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
