భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధుల ముప్పు పెరుగుతోందని ఇటీవల పరిశోధనలు ఆందోళన కలిగించే విషయాలను వెల్లడించాయి. ముఖ్యంగా జీవక్రియ లోపాలతో ముడిపడి ఉన్న ఫ్యాటీ లివర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 33 ఏళ్లలో 143 శాతం కాలేయ సంబంధిత వ్యాధులు పెరగడం ఇందుకు నిదర్శనం. ప్రతి ఆరుగురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ సమస్యలో బాధపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ కేసులు 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 180కోట్లకు చేరుకుంటాయని అంచనా వేసింది. కాలేయ వ్యాధికి సంబంధించిన 3 అతిపెద్ద ప్రమాద కారకాలను లాన్సెట్ అధ్యయనం బహిర్గతం చేసింది.
ది లాన్సెట్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ హెపటాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. శారీరక శ్రమ లేకపోవడం, మారుతున్న ఆహారపు అలవాట్లు, ఊబకాయం, షుగర్ వంటి సమస్యలతో ఫ్యాటీ లివర్ వ్యాధులు పెరుగుతున్నట్లు వెల్లడైంది. 1990 నుంచి 2023 వరకు కొనసాగిన ఈ పరిశోధనలో గడిచిన 33 ఏళ్లలో 143 శాతం కాలేయ సంబంధిత వ్యాధులు పెరిగాయని తేలింది. కాలేయ వ్యాధులకు ఆధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చినప్పటికీ కేసుల సంఖ్యలో పెరుగుదల ఆందోళన కలిగించే విధంగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
భారతదేశంలో ఫ్యాటీ లివర్ డిసీజ్ ప్రమాదకరమైన స్థాయిలో పెరుగుతోంది. ఇటీవలి ఎయిమ్స్ అధ్యయనం ప్రకారం.. 38 శాతం మంది అంటే దాదాపు 40నుంచి -50 కోట్ల మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా. మద్యం సేవించని వారిలో కూడా, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ (NAFLD) కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దాదాపు ప్రతి ఆరుగురు భారతీయులలో ఒకరికి ఈ సమస్య ఉండే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
పిల్లలలో కూడా ఈ సమస్య వ్యాప్తి చెందుతోంది.సుమారు 35శాతం మంది పిల్లలలో ఫ్యాటీ లివర్ లక్షణాలు కనిపిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రారంభ దశలో ఈ వ్యాధి ఎలాంటి లక్షణాలను చూపించదు. అయితే కాలక్రమేణా కాలేయం వాపు, సిర్రోసిస్ ,కాలేయ క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

