అఘాయిత్యం​ తర్వాత ప్రముఖుడి కొడుకు దగ్గరకు

అఘాయిత్యం​ తర్వాత ప్రముఖుడి కొడుకు దగ్గరకు
  • జూబ్లీహిల్స్​ గ్యాంగ్​రేప్​ కేసులో కొత్త విషయాలు
  • వారిని మందలించి పంపిన ప్రముఖుడు
  • బాలిక, ఆమె పేరెంట్స్​కు నిందితుల బెదిరింపు

హైదరాబాద్​, వెలుగు: జూబ్లీహిల్స్​లో బాలికపై అఘాయిత్యం ఘటనలో షాకింగ్​ విషయాలు బయటపడుతున్నాయి. సాదుద్దీన్​తో పాటు మైనర్లను విచారిస్తున్న పోలీసులకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అత్యాచారం అనంతరం సాదుద్దీన్​తో పాటు మైనర్లు పాతబస్తీలోని ఓ ప్రముఖ వ్యక్తి కుమారుడి ఇంటికి వెళ్లి కలిసినట్టు తెలుస్తోంది. ఆ వీడియోలు, ఫొటోలను అతడికి చూపించగా.. అతడి తండ్రి మందలించి పంపినట్టు సమాచారం. అంతేగాకుండా వాటిని డిలీట్​ చేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, వివిధ పార్టీలకు చెందిన నేతల కొడుకులు కావడంతో.. ఏం చేసినా ఇబ్బందులు రావని నిందితులు భావించారని అంటున్నారు. ఆ క్రమంలోనే బాధిత బాలికను, ఆమె కుటుంబ సభ్యులను బెదిరించినట్టు చెప్తున్నారు. గత నెల 28న ఘటన జరిగితే.. నిందితుల బెదిరింపుల వల్లే ఆమె తండ్రి ఆలస్యంగా మే 31న పోలీసులకు ఫిర్యాదు చేశారని సమాచారం.

బాధితురాలిపై కామెంట్లు

జువనైల్​ హోంలో ఉన్న ఎమ్మెల్యే కొడుకు, మాజీ ఎమ్మెల్యే కొడుకు విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించేటప్పుడు పోలీసులతో అనుచితంగా ప్రవర్తించినట్టు సమాచారం. అంతేగాకుండా బాధితురాలి గురించీ అనుచితంగా మాట్లాడినట్టు చెప్తున్నారు. అయితే, ఎమ్మెల్యే కొడుకే తమను ఉసిగొల్పాడని, కాన్సూ బేకరీదాకా అతడే బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని మిగతా మైనర్లు చెప్పినట్టు సమాచారం.

అందరూ ఫిట్​

మైనర్లు సహా ఆరుగురు నిందితులకు శనివారం ఉస్మానియా హాస్పిటల్​లోని ఫోరెన్సిక్​ ల్యాబ్​లో వైద్య పరీక్షలు చేశారు. వారి నుంచి బ్లడ్​ శాంపిళ్లను తీసుకున్నారు. అందరికీ లైంగిక సామర్థ్య పరీక్షలనూ నిర్వహించారు. నిందితులంతా లైంగికంగా ఫిట్​గానే ఉన్నట్టు డాక్టర్లు తేల్చినట్టు సమాచారం. సాయంత్రం ఐదు గంటల వరకు టెస్టులు చేసిన అనంతరం సమయం లేకపోవడంతో మైనర్లను సైదాబాద్​ జువనైల్​ హోంకు తరలించారు. ఆదివారం ఉదయం వారిని మరోసారి కస్టడీకి తీసుకుని జూబ్లీహిల్స్​ పీఎస్​లో విచారించనున్నారు. ఆదివారం సాదుద్దీన్​ కస్టడీ ముగియనుండడంతో జడ్జి ముందు హాజరుపరిచి మళ్లీ చంచల్​గూడ జైలుకు తరలించనున్నారు.