పోరాట యోధుల పేర్లను జిల్లాలకు పెట్టాలి

పోరాట యోధుల పేర్లను జిల్లాలకు పెట్టాలి

 

బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: పోరాట యోధులైన కేంద్ర మాజీ మంత్రులు కాకా గడ్డం వెంకటస్వామి, పి.శివశంకర్, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ, బహుజన చక్రవర్తి సర్వాయి పాపన్న గౌడ్ పేర్లను తెలంగాణ జిల్లాలకు పెట్టాలని సౌతిండియా కాపు అసోసియేషన్ డిమాండ్ చేసింది. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేల్పూరు శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాడిన మహానీయులను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కార్మికుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి.. దళిత ఆశాజ్యోతిగా కాకా వెంకటస్వామి పేరు పొందారన్నారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి, దళితులు, బలహీన వర్గాలకు చెందిన న్యాయవాదులు న్యాయమూర్తులుగా సేవలు అందించడంలో పి.శివశంకర్ పాత్ర ప్రముఖమైందని గుర్తుచేశారు. 

రజాకారుల దౌర్జన్యాలను అడ్డుకొని, నిజాం పాలనపై తిరుగబడ్డ చాకలి ఐలమ్మ పోరాటాలు భావి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఆయన కొనియాడారు. అలాగే, ప్రజా యుద్ధనౌక గద్దర్ కాంస్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌‌‌‌‌‌‌‌పై ఏర్పాటు చేయాలని ఆయన సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విజ్ఞప్తి చేశారు.