కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
  • ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు
  • పలువురు మహిళలకు గాయాలు

గోదావరిఖని, మందమర్రి/బెల్లంపల్లి/ఆసిఫాబాద్, వెలుగు: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌‌ చేస్తూ సింగరేణి పరిధిలోని ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులను సోమవారం ముట్టడించారు. 18రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యేల ఆఫీసుల వద్ద ధర్నా చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని, స్టేషన్ కు తరలించారు. ఈక్రమంలో పలువురికి గాయాలయయ్యాయి.

మందమర్రిలో చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీస్ ను జేఏసీ లీడర్లు ముట్టడించేందుకు ప్రయత్నించగా.. విషయం తెలుసుకున్న పోలీసులు ముందుగానే వారిని అరెస్ట్ చేసి మందమర్రి, కాసీపేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. వీరి ధర్నాకు బీఎస్పీ లీడర్లు మద్దతు తెలపగా వారిని కూడా అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా మందమర్రి సీఐ ప్రమోద్​రావు, మందమర్రి ఎస్ఐ చంద్రకుమార్​మహేందర్​లతో పాటు బెల్లంపల్లి డివిజన్​ పరిధిలోని వివిధ పోలీస్​ స్టేషన్లకు చెందిన ఎస్సైలు, పోలీసులు భారీ సంఖ్యలో మందమర్రిలోని చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీస్​వద్ద రోజంతా కాపలా ఉండడం గమనార్హం. బెల్లంపల్లిలోనూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంప్ ఆఫీసును ముట్టడించేందుకు వెళ్తున్న కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.

ఆసిఫాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును సింగరేణి కార్మికులు ముట్టడించారు. సమస్యలు పరిష్కరించకుంటే ప్రగతిభవన్ ను ముట్టడిస్తామని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి బోగే ఉపేందర్ హెచ్చరించారు. వేతనాలు పెంచకుంటే ఉత్పత్తి నిలిపివేస్తామన్నారు.

గోదావరిఖనిలోని రామగుండం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌‌ను కార్మికులు ముట్టడించారు. ఆఫీస్‌ ముందు బతుకమ్మ ఆటలు ఆడుతూ, సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. కార్మికులు మైక్ లో మాట్లాడేందుకు ఎమ్మెల్యే సిబ్బంది కరెంట్​ఇవ్వలేదు. పట్టణ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యేకు అడుగడుగునా నిరసన సెగ తగిలింది. చివరకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వారి వద్దకు వచ్చి, సమస్యలను మంత్రి కేటీఆర్‌‌ దృష్టికి తీసుకెళ్తానని, త్వరలో పరిష్కరిస్తానన్నారు. కార్మిక సంఘాల జేఏసీతో కలిసి తాను కూడా పోరాటంలో పాల్గొంటానని స్పష్టం చేశారు.