వానాకాలం వచ్చేసింది. వేసవి తాపం నుండి కావలసినంత రిలీఫ్ ఇచ్చిన వానలు రెండు వారాలకే కొత్త సమస్యలు తీసుకొస్తున్నాయ్. అసలే కరోనా టైమ్ అని భయపడుతుంటే కరోనా లక్షణాలతోనే ఇబ్బంది పెట్టే జబ్బులెన్నో మోసుకొచ్చింది వానాకాలం. ఈ రోగాల ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే.. ముందుజాగ్రత్తగా ఉండటం ఒక్కటే ఇప్పుడున్న పరిష్కారం.
జలుబు, జ్వరం, దగ్గు, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ.. సమస్య ఏదైనా ప్రాణాపాయం లేదని తేలిగ్గా తీసిపారేయొద్దు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా తరచుగా ఇన్ఫెక్షన్ల బారినపడుతూ ఉంటే బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఆ టైమ్‌లో కరోనా లాంటి వైరస్ సోకితే.. మందులేని ఆ కోవిడ్–19ని మనం ఎదుర్కోలేం. అందుకే జాగ్రత్త ఒక్కటే మందని గుర్తుంచుకోవాలి. వానాకాలంలో వచ్చే చిన్న చిన్న సమస్యలతో దవాఖానకు పోతే, అక్కడ జనం కారణంగా కరోనా సోకే ప్రమాదమూ ఉంది. అందుకే ముందు జాగ్రత్తలే మేలు.
దోమల వల్ల వచ్చే వ్యాధులు
వానాకాలం వచ్చిందంటే ఎక్కడపడితే అక్కడ చిన్న చిన్న గుంటలు నీళ్లతో నిండి ఉంటయ్. ఈ నీటిలో దోమలు చేరి, వాటి సంతానాన్ని పెంచుకుంటయ్. మలేరియా, ఫైలేరియల్, డెంగ్యూ, చికున్ గున్యాలాంటి తీవ్రమైన జ్వరం కలిగించే జబ్బులు ఈ సీజన్లో ఎక్కువగా రావడానికి ఈ దోమలే కారణం. మురుగునీళ్లు ఎక్కువగా నిల్వ ఉండే పట్టణాల్లోనే కాదు పల్లెల్లో కూడా ఇప్పుడీ సమస్య ఏటా పెరుగుతోంది. మలేరియాకు ట్రీట్‌మెంట్ ఉంది. కానీ, డెంగ్యూ, చికున్ గున్యాకు వాటి లక్షణాలు, వ్యాధి తీవ్రత ఆధారంగానే ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. తీవ్రమైన జ్వరం రెండు, మూడు రోజులు వస్తే వాటిని నిర్లక్ష్యం చేయొద్దు. చికిత్స ఆలస్యమైతే చాలా నష్టం జరుగుతుంది. కరోనా సమస్య ఉన్న ఈ సమయంలో జ్వరాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, జాగ్రత్తలు తీసుకుని అవసరాన్ని బట్టి డాక్టర్‌కి చూపించుకోవాలి.
తప్పించుకోవడమిలా..
కిటికీలు, తలుపులకు మెష్‌ను ఏర్పాటు చేయాలి.
పడుకునేటప్పుడు దోమ తెరను వాడడం బెస్ట్.
దోమలు ఎక్కువగా ఉంటే.. మస్కిటో రిపెల్లెంట్ కాయిల్స్ ఉపయోగించాలి.
పిల్లలకు పొడవాటి చేతులున్న షర్ట్, ఫుల్ ట్రౌజర్లు తొడుక్కోవాలి.
ఇంటికి దగ్గర్లో నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. అవసరమైతే అధికారులకు చెప్పి, పనులు చేయించాలి.
ఇండ్లలో ఉండే గాబు, వాటర్ ట్యాంక్, నీటి పాత్రలపై మూతలు పెట్టాలి.
పాతబడిన టైర్లు, డ్రమ్ముల్లాంటి వాటిలో నీటి నిల్వ లేకుండా చూడాలి.
నీళ్లతో అంటుకుంటుంది
తినే తిండి, తాగే నీళ్లు కలుషితం అయితే చాలా సమస్యలు వస్తాయి. వర్షాలు, వరదల వల్ల నీళ్లు కలుషితం కావడం చాలా సాధారణమే. అందుకే ఈ సమయంలో మంచి నీళ్ల విషయంలో అలర్ట్‌గా ఉండాలి. నీళ్లు కలుషితమైతే వైరల్ హెపటైటిస్–ఎ, కలరా, టైఫాయిడ్, గ్యాస్ట్రో ఎంటిరిటిస్ వంటి అంటువ్యాధులు వస్తాయి. ఈ సమస్యలు తీవ్రమైన జ్వరం, విరేచనాలు కావడం, కామెర్ల రూపంలో బయటపడతాయి.
ఫంగల్ ఇన్ఫెక్షన్లు
తడిగా, తేమగా ఉన్న వాతావరణంలో ఉండటం వల్ల చర్మంపై ముఖ్యంగా పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకే చేతి, కాలి గోళ్లు కొంచెం పెరిగినప్పుడే కత్తిరించాలి. మురికి నీళ్లలోకి దిగకూడదు. ఒకవేళ మురికినీళ్లలోకి దిగితే తర్వాత శుభ్రంగా కడగాలి.
శుభ్రతే మందు
కొన్న తర్వాత, వండే ముందు కూరగాయల్ని శుభ్రంగా కడగాలి.
పండ్లు తినడానికి ముందు మరోసారి కడగాలి.
తినే ముందు చేతులు సబ్బుతో కడగాలి.
దేన్నైనా కడిగేముందు ఆ నీళ్లు మంచిగా ఉన్నదీ లేనిదీ చెక్ చేసుకోవాలి.
కాచి, మరిగించిన తర్వాత వడపోసిన మంచి నీళ్లనే తాగాలి.
ఈ సీజన్లో స్ట్రీట్ ఫుడ్ మానేస్తేనే మంచిది.
ఈగలు వాలే చోట అమ్మే పుడ్ కొనవద్దు.
అవసరమనుకుంటే హెపటైటిస్ ఎ, టైఫాయిడ్ టీకాలు వేయించుకోవచ్చు.

