ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక స్టేజీలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు నిరాశపడకుండా ఆ కష్టాలే విజయాలకు బాటలు చూపిస్తాయని నమ్మాడు సునీల్ వశిష్ట్. అందుకే ఒకప్పుడు పిజ్జా డెలివరీ బాయ్‌గా, వెయిటర్‌గా పనిచేసిన సునీల్ ఇప్పుడు కొన్ని కోట్ల విలువైన డెజర్ట్ బ్రాండ్‌ను స్థాపించాడు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే..
సునీల్ వశిష్ట్ ఢిల్లీలోని ఆర్థికంగా వెనుకబడిన ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు. తండ్రి మెకానికల్ లేబర్‌గా పని చేసేవాడు. 1992లో సునీల్ మంచి మార్కులతో పదో తరగతి పాసయ్యాడు. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి ఆనందంతో ఆ విషయాన్ని చెప్పాడు. ఆలింగనాలు, అభినందనలకు బదులు వాళ్లు అతనితో అన్న మాటలు విని ఎంతో నిరుత్సాహపడ్డాడు. ‘‘నిన్ను ఇంకా చదివించే స్థోమత మాకు లేదు. కాలేజీకి వెళ్లాలి అనుకుంటే అందుకు కావాల్సిన డబ్బుని నువ్వే సంపాదించుకోవాలి” అని చెప్పారు. ఆ తర్వాత సునీల్ తన చదువు కోసం ఎలాగైనా డబ్బు సమకూర్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఢిల్లీలోనే ఒక స్కూల్‌లో 11వ తరగతిలో చేరాడు. దాంతోపాటే సిటీలోని ఒక పాల కంపెనీలో పార్ట్ టైం డెలివరీ జాబ్‌లో చేరాడు. నెలకు 200 రూపాయలు వచ్చేవి. ఉదయాన్నే 5 గంటలకు వెళ్లి గంటపాటు ఇళ్లలో తిరుగుతూ పాలు డెలివరీ చేసేవాడు. వాళ్ల దగ్గరునుంచి డబ్బు వసూలు చేసి కంపెనీకి ఇచ్చేవాడు. ఆ తర్వాత ఇంటికెళ్లి రెడీ అయ్యి కాలేజీకి వెళ్లేవాడు. అలా రెండేండ్లపాటు పనిచేసి, తన ఫీజులు తనే కట్టుకున్నాడు.
వెయిటర్‌గా..
ప్లస్ 2 పూర్తి చేసి డిగ్రీలో చేరాడు. మళ్లీ ఫీజు కోసం పనిలో చేరాలని నిర్ణయించుకున్నాడు. ‘‘నేను బ్యాచిలర్ డిగ్రీలో చేరాను. అదే టైంలో ఢిల్లీలో చిన్నా చితకా పనుల కోసం వెతికాను. ఫామ్‌హౌస్, రెస్టారెంట్లలో వెయిటర్‌గా, చీరల దుకాణంలో సేల్స్‌పర్సన్‌గా, కొరియర్ డెలివరీ బాయ్‌గా.. ఇలా ఎన్నో పనులు చేశా” అని గుర్తుచేసుకున్నాడు సునీల్. కానీ.. పని చేస్తూ చదువుకోవడం సాధ్యపడలేదు. దాంతో సునీల్ రెండో సంవత్సరంలోనే చదువు మానేయాల్సి వచ్చింది. భవిష్యత్తు అంధకారంగా కనిపించింది. కానీ.. బతకడానికి ఏదో ఒక పని చేయాలి కాబట్టి 1998లో డొమినోస్ పిజ్జా చైన్‌లో డెలివరీ బాయ్ ఉద్యోగంలో చేరాడు. “ఎంతో కష్టపడి పనిచేశా. రెండేండ్లలోనే అసిస్టెంట్ మేనేజర్ స్థాయికి ఎదిగా. కానీ, నా జీవితంలో ఎదురైన ఒక సంఘటన వల్ల ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. అప్పుడు నా భార్య గర్భవతి. ఒకరోజు ఆమెకు ప్రసవ వేదన మొదలైందని, వెంటనే ఇంటికి రావాలని నాకు ఫోన్ వచ్చింది. నేను సెలవు కావాలని నా సీనియర్‌కు రిక్వెస్ట్ పెట్టుకున్నా. అతను యాక్సెప్ట్ చేయలేదు. అయినా, తప్పని పరిస్థితుల్లో సెలవు తీసుకున్నా. అదే రోజు నా భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మరుసటి రోజు ఆఫీస్‌కు వెళ్లా. నా సీనియర్ ‘నువ్వు ఇకపై ఉద్యగానికి రావాల్సిన అవసరం లేదు’ అని చెప్పేశాడు. ఆ సంఘటన నన్ను ఎంతో ఆలోచింపజేసింది. నేను మళ్లీ ఎవరి దగ్గరా ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకున్నా’’ అని చెప్పాడు సునీల్.
ఎగ్ రోల్ బండి.. కేక్ షాప్
పెద్ద ఎత్తున వ్యాపారం పెట్టేటంత పెట్టుబడి లేదు. అందుకే సునీల్ కుటుంబాన్ని పోషించడానికి, ఏదైనా సంపాదించాలనే ఆశతో ఢిల్లీలోని జేఎన్‌యూ బయట ఒక ఎగ్ రోల్ బండి పెట్టుకున్నాడు. బిజినెస్ బాగానే జరిగేది. కానీ.. పెట్టిన రెండు నెలలకే మున్సిపల్ కార్పొరేషన్ అతని బండిని తీసేయించింది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు చిన్నా చితకా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించాడు.
ఒకరోజు సునీల్ తన ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నప్పుడు అతను ‘‘నోయిడాలో ప్రజలకు అకస్మాత్తుగా డెజర్ట్‌లంటే, ముఖ్యంగా కేక్‌లంటే ఇష్టం పెరిగినట్లుగా ఉంది. ఈ మధ్య బాగా తింటున్నారు” అన్నాడు. సునీల్‌కు వెంటనే అలాంటి వ్యాపారం పెట్టాలనే ఆలోచన వచ్చింది. అప్పుడే నోయిడాలోని సెక్టార్ 61లో కొత్త మాల్ ప్రారంభమవుతోందని తెలిసి, అక్కడ కేక్ షాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఫ్రెండ్స్ దగ్గర కొంత అప్పు చేసి ఆ డబ్బుతో మాల్‌లో ఒక చిన్న స్థలాన్ని అద్దెకు తీసుకున్నాడు. షాప్ పెట్టేందుకు తన భార్య నగలను అమ్మాడు. అలా 2007లో ‘ఫ్లయింగ్ కేక్స్’ పేరుతో పేస్ట్రీలు, కేకులు, డెజర్ట్‌లు అమ్మే షాప్ మొదలైంది.
పాంప్లెట్స్తో..
మొదట్లో దుకాణానికి పెద్దగా జనం వచ్చేవారు కాదు. కానీ, 2008లో మాల్ బయట తన షాపు గురించి ప్రచారం చేసేందుకు పాంప్లెట్స్ పంచుతున్నప్పుడు అతని అదృష్టం మారింది. ‘‘అటుగా వెళ్తూ దుకాణానికి వచ్చిన ఒక మహిళకు నేను పాంప్లెట్ ఇచ్చా. ఆమె తన బిడ్డ కోసం ఒక కేక్ కొన్నది. అదృష్టవశాత్తు ఆమె ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌లో హెచ్‌ఆర్ మేనేజర్. ఆమెకు మా కేక్ చాలా నచ్చింది. దాంతో వాళ్ల కంపెనీలో జరిగే అన్ని ఈవెంట్స్‌కి మాకే కేకుల ఆర్డర్ ఇచ్చింది”అని సునీల్ గుర్తుచేసుకున్నాడు. అప్పటినుంచి సునీల్‌కు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు ఫ్లయింగ్ కేక్స్ బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, ముంబై లాంటి సిటీల్లో విస్తరించింది. 15కు గా అవుట్‌లెట్లు ఉన్నాయి. ఇప్పుడది కోట్ల విలువైన బ్రాండ్‌గా ఎదిగింది.
