తునికాకు సేకరణ షురూ...కాళేశ్వరం సర్కిల్ లోని 7 డివిజన్లలో కొనసాగుతున్న ఆకుసేకరణ

తునికాకు సేకరణ షురూ...కాళేశ్వరం సర్కిల్ లోని 7 డివిజన్లలో కొనసాగుతున్న ఆకుసేకరణ
  •     గిరిజనుల రెండవ పంట
  •     ఏజెన్సీలో నెలరోజుల పాటు ఉపాధి
  •     41 యూనిట్లలో 40,600 ఎస్​బీలు టార్గెట్

జయశంకర్​ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం సర్కిల్ లోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లోని 7 డివిజన్లలో తునికాకు సేకరణ జోరుగా సాగుతోంది. గిరిజనులు, రైతులు తెల్లవారుజామునే అడవులకు వెళ్లి తునికాకు సేకరిస్తున్నారు. స్టాండర్డ్ బ్యాగుకు రూ.3,400 ధర నిర్ణయించడంతో ఆకు సేకరణపై ఆసక్తి పెరిగింది. ఈ ఏడాది మూడు జిల్లాల పరిధిలోని 41 యూనిట్లలో 40,600 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, 47 యూనిట్లకు ఐదుసార్లు టెండర్లు పిలవగా, 41 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి. మిగతా యూనిట్లకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అక్కడ సేకరణ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. కాళేశ్వరం సర్కిల్ లో గతేడాది 47 యూనిట్లకు 37 యూనిట్లు సేల్ కాగా, 32,900 స్టాండర్డ్ బ్యాగుల సేకరణ లక్ష్యానికి 20,537 బ్యాగులు మాత్రమే సేకరించారు.
 

ఏజెన్సీ ప్రజలకు ఉపాధి..

ప్రకృతి సంపద అయిన తునికాకు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఉపాధి వనరు. వ్యవసాయ పనులు ముగిసిన తర్వాత వేసవిలో నెల రోజులపాటు కుటుంబ సభ్యులంతా అడవులకు వెళ్లి ఆకు సేకరిస్తారు. ఈ ఆదాయంతో వానాకాలం పంటల పెట్టబడికి అవసరమైన డబ్బులు సమకూర్చుకుంటారు. అయితే, కొద్ది రోజులుగా కూలీ గిట్టుబాటు తగ్గడం, ఆకు దిగుబడి ఆశించినంత లేకపోవడంతో కూలీలు పనులకు ఆసక్తి చూపడం లేదు. దీంతో కొన్ని యూనిట్లకు కాంట్రాక్టర్లు దూరంగా ఉంటున్నారు.  

జిల్లాల వారీగా లక్ష్యాలు

కాళేశ్వరం సర్కిల్​ పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 15 యూనిట్లలో 17,600 ఎస్‌‌‌‌బీలు, ములుగు జిల్లాలో 23 యూనిట్లలో 19,800 ఎస్‌‌బీలు, పెద్దపల్లి జిల్లాలో 3 యూనిట్లలో 3,200 ఎస్‌‌బీలు లక్ష్యంగా నిర్ణయించారు. అటవీశాఖ అధికారులు కల్లాల ఏర్పాటు, కొమ్మలు కొట్టడం వంటి పనులు చేపట్టారు. ములుగు జిల్లాలో అన్ని యూనిట్లు సేల్ కాగా, భూపాలపల్లిలో 19 యూనిట్లకు 15 యూనిట్లలో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. నాగారం, తాడిచర్ల, వల్లంకుంట, మహదేవపూర్​ డివిజన్​లో కాటారం కల్లాలు టెండర్లు కాకపోవడంతో ఇక్కడ ఈ ఏడాది తునికాకు సేకరణ లేనట్లేనని స్థానిక ప్రజలు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో 4 యూనిట్లకు కూడా ఒక యూనిట్ టెండర్ కాలేదు.

పెరిగిన యూనిట్లు.. 

ఈ సర్కిల్ పరిధిలో ఈ ఏడాది 47 యూనిట్లలో ఆకు సేకరణకు జనవరి 23 నుంచి మార్చి నెల 7 వరకు 5సార్లు టెండర్లు పిలవగా 41 యూనిట్లలో ఆకు సేకరణకు కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకున్నారు. దీంతో అటవీశాఖ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో తునికాకు సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఈ ఏడాది అక్టోబర్ నుంచి వర్షాలు లేక పోవడంతో అడవుల్లో ఆకు తక్కువగా వచ్చిందని, ఉన్న చోట ఆకులకు చిల్లులు పడి నాణ్యత దెబ్బతిన్నదని కూలీలు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది లక్ష్యాన్ని సాధించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.