రాజన్న జిల్లాలో శరవేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం

రాజన్న జిల్లాలో శరవేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం
  • 6,448 ఇండ్లు మంజూరు కాగా.. 3,844 పూర్తి 
  •     ఇందిరమ్మ ఇండ్ల పూర్తిలో సిరిసిల్ల రాష్ట్రంలో సెకండ్ ప్లేస్
  •     పూర్తయిన ఇండ్లకు రూ.169 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం రాజన్నసిరిసిల్ల జిల్లాలో శరవేగంగా సాగుతోంది.  జిల్లాకు 6,448 ఇండ్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు 3,844 ఇండ్లు పూర్తయి(38.35శాతం) రాష్ట్రంలోనే సెకండ్ ప్లేస్‌‌లో నిలిచింది. మొదటి స్థానంలో ఖమ్మం జిల్లా(38.35శాతం) ఉంది. కాగా ఇప్పటివరకు పూర్తయిన ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల అకౌంట్లలో రూ.169కోట్లు జమ అయినట్లు అధికారులు చెబుతున్నారు. మూడో స్థానంలో హనుమకొండ జిల్లా(29.35శాతం) ఉండగా.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేవలం 3.90 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఇక కరీంనగర్ జిల్లా19వ స్థానం, పెద్దపల్లి 20 స్థానం, జగిత్యాల27 స్థానంలో ఉన్నాయి. 

అధికారుల చొరవతో స్పీడ్‌‌‌‌గా పనులు

జిల్లా అధికారుల పర్యవేక్షణ, కింది స్థాయి అధికారుల చొరవ వల్లే ఇండ్ల పనులు స్పీడ్‌‌గా సాగుతున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్‌‌‌‌ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ప్రత్యేక చొరవ చూపారు. ప్రస్తుత కలెక్టర్ గరిమా అగ్రవాల్ సైతం ఆఫీసర్లతో నిత్యం రివ్యూలు నిర్వహిస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో ఆఫీసర్లు లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా చొరవ తీసుకుంటున్నారు. మరోవైపు జిల్లాలో ‘మన ఇసుక’ విధానంతో ఈజీగా తక్కువ ధరకు ఇసుక దొరుకుతోంది. నిర్మాణాలు వేగంగా జరుగుతుండగా పూర్తయిన స్థాయిలను బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమవుతుండడంతో లబ్ధిదారులు ఉత్సాహంగా పనులు చేయిస్తుండడంతో నిర్మాణాలు స్పీడ్‌‌గా సాగుతున్నాయి. 

రాజన్న సిరిసిల్ల జిల్లాకు 6,449 ఇండ్ల శాంక్షన్ కాగా 5,760 ఇండ్లు పనులు ప్రారంభించారు. ఇందులో ఇప్పటికే 3,844 పూర్తి కాగా.. వీరిలో 2,217 మంది లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేసుకున్నారు. మరో 1,637 ఇండ్లు పూర్తయి గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకా 692 ఇండ్లు బేస్‌‌మెంట్‌‌ లెవల్, 397 ఇండ్లు గోడల వరకు పూర్తయ్యాయి. ఇప్పటికే పూర్తయిన ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో సర్కార్‌‌‌‌ రూ.169 కోట్లు జమ చేసింది. 

20 ఏండ్ల కల నెరవేరింది. 

నాకు 20 ఏండ్లుగా సొంతిల్లు లేదు. దీంతో పాత మట్టి ఇంట్లోనే నివసించాం.. వానాకాలం వచ్చిన్నపుడల్లా ఇబ్బందులు పడ్డం. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో నా 20 ఏండ్ల కల నిజమైంది. ఇప్పుడు వానలు వచ్చినా బాధలేదు.                         -
గుండెల్లి స్వామి, ఎల్లారెడ్డిపేట

ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అందిస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలి. అధికారుల పర్యవేక్షణ, చొరవతోనే ఇండ్ల నిర్మాణాలు స్పీడ్‌‌గా సాగుతున్నాయి. 
-వెంకట మాధవరావు, పీడీ హౌసింగ్