ఖమ్మం మార్కెట్ కు ఏపీ నుంచి మక్కలు!

ఖమ్మం మార్కెట్ కు ఏపీ నుంచి మక్కలు!
  • సరిహద్దు మండలాల నుంచి ట్రాక్టర్లలో తీసుకొస్తున్న బ్రోకర్లు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి మక్కలు పెద్దఎత్తున తరలివస్తున్నాయి. అక్కడ తక్కువ ధరకు మొక్కజొన్న కొనుగోలు చేసి, సరిహద్దు మండలాల ద్వారా ట్రాక్టర్లలో తీసుకువచ్చి స్థానిక రైతుల పేర్లతో ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు బ్రోకర్లు అగ్రికల్చర్​ ఆఫీసర్లను మేనేజ్ చేస్తూ క్రాప్ బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇబ్బందులు లేకుండా ఈ దందాను కొనసాగిస్తున్నారని రైతులు చెబుతున్నారు. 

ప్రైవేట్ కంపెనీలతో కాంటాక్ట్ పెట్టుకుని మొక్కజొన్నలు సాగు చేసిన రైతులు వాటిని సదరు కంపెనీలకే అమ్ముకున్నప్పటికీ, అదే రైతుల పేర్లతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మక్కలు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి మక్కజొన్న సాగు జరిగింది. ఖమ్మం జిల్లాలో 2.26 లక్షల ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 70 వేల ఎకరాల్లో మక్కలు సాగు చేశారు. పత్తి పంటలో దిగుబడి తగ్గడంతో అనేక మంది రైతులు మక్కల సాగు వైపు మొగ్గు చూపారు. ఈసారి ఎకరానికి సుమారు 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

కొనుగోలు కేంద్రాల వద్ద ఉద్రిక్తత..

మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెడ్ అధికారులు ఎకరానికి 26 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఖమ్మం జిల్లాలో 40, కొత్తగూడెం జిల్లాలో 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 2.18 లక్షల మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాలో 30 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేశారు. అయితే గోడౌన్లు పూర్తిగా నిండిపోవడంతో నిల్వ సమస్యలు తలెత్తాయి. దీంతో మక్కలను ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. అవసరమైతే సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లను కూడా తాత్కాలిక గోడౌన్లుగా వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. 

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ట్రాక్టర్లలో మక్కలు రావడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రధానంగా వేంసూరు మండలం, కల్లూరు, ఎర్రుపాలెం, ముదిగొండ, చింతకాని, బోనకల్ మండలాల్లో ఏపీ ట్రాక్టర్ల రాకపోకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు లారీల కొరత, హమాలీల కొరతతో ఇప్పటికే కొనుగోలు చేసిన మక్కలు వేల బస్తాలుగా కేంద్రాల వద్దనే నిల్వ ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలు వస్తే పంట నష్టపోతుందనే భయం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ మక్కలతో గొడవలు

ఈ నెల 8న వేంసూరు మండలంలోని కల్లూరుగూడెం గోడౌన్ వద్ద స్థానిక రైతులు, ఆంధ్ర నుంచి వచ్చిన ట్రాక్టర్ డ్రైవర్ల మధ్య వాగ్వాదం జరిగింది. తమకు వరుసలో దిగుమతి చేసుకోవడానికి వారం పడుతుంటే, బయట నుంచి మక్కలు తీసుకువచ్చి విక్రయించడం అన్యాయమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఎర్రుపాలెం కొనుగోలు కేంద్రంలో కూడా ఇలాంటి ఘటన వెలుగుచూసింది. ఏపీ ఎన్టీఆర్ జిల్లాలోని గూడెం మాధవరం గ్రామానికి చెందిన వ్యక్తి, జమలాపురం గ్రామానికి చెందిన రైతు పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించి నాలుగు ట్రాక్టర్ల మొక్కజొన్నలను అక్కడ విక్రయించినట్లు సమాచారం. దీంతో స్థానిక రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మక్కలు తెచ్చి రెండు వారాలైనా దిగుమతిచేసుకోలే..

ఈ సంవత్సరం వర్షాలు అధికంగా ఉండడంతో పత్తి పంట దిగుబడి రాలేదు. అందుకే పత్తిని తీసేసి మూడెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. నాలుగు ట్రక్కుల మొక్కజొన్నలు ఎర్రుపాలెం గోడౌన్​కు రెండు వారాల క్రితం తీసుకొచ్చా. ఇప్పటివరకు వాటిని దింపుకోలేదు. గోడౌన్ ఖాళీ లేదని చెప్తున్నారు. ఏపీ నుంచి వచ్చిన ట్రాక్టర్లను దిగుమతి చేసి గోడౌన్ నిండిపోయిందని చెబుతున్నారు.

గురజాల రాంబాబు, పెగళ్లపాడు 

బస్తాకు రూ.50 డిమాండ్​ చేస్తున్నారు

కూసుమంచి మండలం జీళ్లచెరువులో కొనుగోలు కేంద్రానికి 1800 మంది రైతులు 2.50 లక్షల క్వింటాళ్లు మక్కలు తెచ్చారు. 81,750 క్వింటాళ్లు కాంటాలు వేసి తరలించారు. లారీల కొరత ఉండడంతో 70,750 క్వింటాళ్లు  కొనుగోలు కేంద్రంలోనే ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్​ గోడౌన్​లకు ఈ మక్కలను తరలించేందుకు బస్తాకు రూ.50 అడుగుతున్నారు. దీంతో ఒక్కో రైతుపై అదనంగా రూ.20 వేల వరకు భారం పడుతోంది.

అంబాల వీరబాబు, జీళ్లచెరువు