కాగజ్ నగర్​లో పులి కలకలం

కాగజ్ నగర్​లో పులి కలకలం
  • మెయిన్​రోడ్డుపై కనిపించడంతో కలకలం.. భయాందోళనలో జనం

  • నిఘా పెట్టామన్న ఫారెస్ట్​ ఆఫీసర్లు.. గస్తీ ఏర్పాటు చేసిన పోలీసులు

  • మూడు రోజుల కింద వాంకిడిలో పులి దాడిలో వ్యక్తి మృతి

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్​నగర్​లో మెయిన్​రోడ్డుపై పులి కనిపించడం కలకలం రేపింది. గురువారం చీకటి పడే టైమ్​లో ఇండ్లకు కొన్ని మీటర్ల దూరంలోని ఆసిఫాబాద్ ఎక్స్ రోడ్ పై ఉన్న చెక్​పోస్ట్ దగ్గర పులి రోడ్డు దాటుతూ కనిపించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కొందరు పులిని చూసి టెన్షన్​ పడ్డారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగజ్ నగర్ ఎఫ్డీవో విజయ్ కుమార్, సిబ్బంది అక్కడికి చేరుకొని పులి అడుగులు గుర్తించారు. పులి పాదాల గుర్తులు కొలత తీసుకొని నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 

పులి వచ్చింది నిజమే అని, పట్టణ శివారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దన్నారు. మూడు రోజుల కింద వాంకిడి మండలం ఖానాపూర్ లో పులి దాడి చేసి వృద్ధుడిని చంపింది ఇదే పులి కావొచ్చని స్థానికులు భయపడుతున్నారు. పులి కనిపించడంతో పోలీసులు పట్టణంలో రాత్రి గస్తీ ఏర్పాటు చేశారు. పులిని బంధించేందుకు రెస్క్యూ టీమ్ తో పాటు వాహనం కూడా రెడీగా ఉంచారు.