కేసీఆర్ సార్..మీ బర్త్ డే రోజు మా జిల్లాలకు పంపండి

 కేసీఆర్ సార్..మీ బర్త్ డే రోజు మా  జిల్లాలకు పంపండి

317 జీవోకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలు అసెంబ్లీ ముట్టడికి యత్నించాయి. అలాగే  స్పౌజ్‌ బదిలీలను సక్రమంగా జరపాలని..సొంత జిల్లాలో ఉద్యోగాలకు పంపాలని టీచర్లు డిమాండ్ చేశారు.  కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సొంత జిల్లాలకు పంపాలని ప్లకార్డులను ప్రదర్శించారు. దీంతో అసెంబ్లీ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన టీపీయూఎస్ ,జీవో 317 బాధిత ఉపాధ్యాయులందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా  గాంధీ నగర్ పీఎస్ కి తరలించారు. 

అంతకుముందు ఉపాధ్యాయ సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. పలు డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ  జీవో నెం.317 తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ బాధితులు అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లారు. బిర్లా మందిర్ నుంచి అసెంబ్లీ వైపు ర్యాలీగా వెళ్తున్న ఉపాధ్యాయలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలో భాగంగా ఉపాధ్యాయులు, సీఎం కేసీఆర్ ఫేస్ మాస్క్ ను ధరించి నిరసన తెలిపారు. జీవో నెం.317 వల్ల స్థానికతను కోల్పోయామని టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన కానుకగా తమను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని వేడుకున్నారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తోన్న టీచర్ల దగ్గర్నుంచి ఫేస్ మాస్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.