చెత్తకు జాగలేదు..పత్తాలేని కొత్త డంప్ యార్డులు

చెత్తకు జాగలేదు..పత్తాలేని కొత్త డంప్ యార్డులు

హైదరాబాద్‌‌, వెలుగుహైదరాబాద్‌‌ మహానగరంలో నిత్యం సేకరించే చెత్త ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం గ్రేటర్‌‌ పరిధిలోని చెత్తను జవహర్‌‌ నగర్‌‌ డంపింగ్‌‌ యార్డుకు తరలిస్తున్నారు. నేడు అది పూర్తిగా నిండిపోయింది. భారీ చెత్తకుప్పకు క్యాపింగ్‌‌ చేస్తున్నారు. మళ్లీ అక్కడ చెత్తను వేయొద్దని నిర్ణయించారు. ప్రత్నామ్నాయంగా సిటీలో మరో మూడు చోట్ల భారీ డంపింగ్‌‌ యార్డులు ఏర్పాటు చేయాలని భావించారు.  జవహర్‌‌నగర్‌‌ డంపింగ్‌‌ యార్డుతో స్థానికులు ఎలాంటి కష్టాలు పడ్డారో తెలిసిందే. మా ప్రాంతాల్లో డంపింగ్‌‌ యార్డులు ఏర్పాటు చేయొద్దంటూ స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కొత్త డంప్​యార్డులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.

రోజుకు 5280 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి

గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ పరిధి 625 చ‌‌.కి.మీ విస్తీర్ణం. కోటిమందికి పైగా జనాభా.  రోజుకు 5,280 మెట్రిక్ ట‌‌న్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇందులో 2,510 మెట్రిక్ ట‌‌న్నులు త‌‌డి చెత్త, 1952 మెట్రిక్ ట‌‌న్నులు పొడి చెత్త, 820 మెట్రిక్ ట‌‌న్నులు ఇత‌‌ర వ్యర్థాలను జ‌‌వ‌‌హ‌‌ర్‌‌న‌‌గ‌‌ర్‌‌లోని డంపింగ్‌‌యార్డ్‌‌కు జీహెచ్ఎంసీ త‌‌ర‌‌లిస్తోంది. 135 ఎక‌‌రాల విస్తీర్ణంలో 2002 నుంచి వేసిన భారీ చెత్తతో 14 మిలియ‌‌న్ ట‌‌న్నుల‌‌కు పైగా ఘ‌‌న వ్యర్థాలున్న జ‌‌వ‌‌హ‌‌ర్‌‌న‌‌గ‌‌ర్ డంపింగ్‌‌ యార్డ్ కు క్యాపింగ్ చేపట్టింది. 2018 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.144 కోట్ల వ్యయంతో డంపింగ్‌‌ యార్డు క్యాపింగ్‌‌ పనులు చేపట్టింది. మళ్లీ అక్కడ చెత్తను వేయబోమని జీహెచ్‌‌ఎంసీ తెలిపింది. క్యాపింగ్‌‌ ప్రక్రియ దాదాపు పూర్తయింది. జవహర్‌‌ నగర్‌‌ డంపింగ్‌‌ యార్డును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌‌ఎంసీ చర్యలు తీసుకుంటోంది. క్యాపింగ్‌‌ పూర్తయిన తర్వాత చెత్తను జవహర్‌‌నగర్‌‌ డంపింగ్‌‌ యార్డుకు తరలించడం ఆపేస్తామని ముందుగా చెప్పినప్పటికీ కొత్త డంపింగ్‌‌ యార్డులు ఏర్పాటు కాకపోవడంతో ఇంకా జవహర్‌‌నగర్‌‌ డంపింగ్‌‌ యార్డుకే చెత్తను తరలిస్తున్నారు.

మా ప్రాంతాల్లో ఏర్పాటు చేయొద్దు

హైదరాబాద్‌‌ నగర అవసరాలను దృష్టిలో పెట్టుకుని 2017 డిసెంబర్‌‌లో జీహెచ్‌‌ఎంసీ కొత్త డంపింగ్‌‌ యార్డులకు ప్రతిపాదన సిద్ధం చేసింది. జవహర్‌‌నగర్‌‌కు 50 కిలో మీటర్ల దూరంలో మూడు వైపులా డంపింగ్‌‌ యార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం తలకొండపల్లిలో 44 ఎకరాలు, కేశంపేట్‌‌లో 159 ఎకరాలు, రామేశ్వరబండలో 80 ఎకరాల స్థలాన్ని గుర్తించింది. కానీ స్థానిక గ్రామస్థులు వ్యతిరేకించడంతో ప్రతిపాదన నిలిచిపోయింది. జవహర్‌‌ డంపింగ్‌‌ యార్డు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జ‌‌ల‌‌, వాయు కాలుష్యాలు ఏర్పడి జ‌‌వ‌‌హ‌‌ర్‌‌న‌‌గ‌‌ర్‌‌, ప‌‌రిస‌‌ర గ్రామాల ప్రజ‌‌లు సమస్యలు ఎదుర్కొన్నారు. ఏళ్ల తరబడి ఆందోళనలు నిర్వహించారు. కొంద‌‌రు గ్రీన్ ట్రిబ్యున‌‌ల్‌‌లో కూడా కేసులు న‌‌మోదు చేశారు. ఈ సమస్యలను చూసిన ప్రజలు తమ ప్రాంతాల్లో డంపింగ్‌‌ యార్డు ఏర్పాటు చేయడాని వీల్లేదంటూ తేల్చిచెబుతున్నారు. తమ ప్రాంతం మరో జవహర్‌‌నగర్‌‌ అయ్యే ప్రమాదముందని వ్యతిరేకిస్తున్నారు.

ఆటోల ద్వారా ట్రాన్స్‌‌ఫర్‌‌ స్టేషన్‌‌లకు..

ఇంటింటి నుంచి సేక‌‌రించిన చెత్తను ఆటోలు, రిక్షాల ద్వారా ట్రాన్స్‌‌ఫర్‌‌ స్టేషన్‌‌లకు తరలిస్తారు. అక్కడి నుంచి పెద్ద టిప్పర్లలో జ‌‌వ‌‌హ‌‌ర్‌‌న‌‌గ‌‌ర్‌‌కు తీసుకెళ్తారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా 20 ట్రాన్స్‌‌ఫర్‌‌ స్టేషన్‌‌లు ఉన్నాయి. ప్రతి సర్కిల్‌‌కు ఒకటి చొప్పున సిటీలో 30 ట్రాన్స్‌‌ఫర్‌‌ స్టేషన్‌‌లు ఏర్పాటు చేయాలని జీహెచ్‌‌ఎంసీ భావిస్తోంది. రాజేంద్రన‌‌గ‌‌ర్, దేవేంద‌‌ర్‌‌న‌‌గ‌‌ర్, మ‌‌ల్లాపూర్, దీప్తిన‌‌గ‌‌ర్, నేరేడ్‌‌మెట్ ట్రాన్స్‌‌ఫ‌‌ర్ స్టేష‌‌న్, మ‌‌చ్చబొల్లారం, సాకేత్, హెచ్ఎంటీ పైప్‌‌లైన్ రోడ్, అంబ‌‌ర్‌‌పేట‌‌, ఇమ్లీబ‌‌న్‌‌, యూసుఫ్‌‌గూడ‌‌, న‌‌ల్లగండ్ల,  ట్యాంక్‌‌బండ్‌‌, నాగోల్‌‌, కైత‌‌లాపూర్‌‌, జియాగూడ‌‌,  నోవాపాన్ ప‌‌టాన్‌‌చెరు, మౌలాలి, ఆర్‌‌సీపురం ప్రాంతాల్లో ట్రాన్స్‌‌ఫర్‌‌ స్టేషన్‌‌లు ఉన్నాయి. నగరంలో కొత్త డంపింగ్‌‌ యార్డులు ఏర్పాటు చేయకుండా ఇలాంటి పరిస్థితే కొనసాగితే పర్యావరణానికి హాని కలుగుతుంది. చెత్త నుంచి విద్యుత్‌‌ ఉత్పత్తి వంటి ప్రత్యామ్నాయ పద్ధతుల్ని అనుసరించడం ద్వారా మెరుగైన వ్యర్థాల నిర్వహణ చేయవచ్చని పర్యావరణవేత్తలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. నివాస ప్రాంతాలకు దూరంగా డంపింగ్‌‌ యార్డు ఏర్పాటు చేసి, శాస్త్రీయ పద్ధతుల్లో ట్రీట్‌‌మెంట్‌‌ చేస్తే పర్యావరణానికి హాని కలగదని చెబుతున్నారు.