పచ్చని పల్లెటూరు.. దేశంలోనే మొదటిది

పచ్చని పల్లెటూరు.. దేశంలోనే మొదటిది

పల్లెటూరు అనగానే గుర్తొచ్చేది పచ్చని పొలాలు, పైర గాలి, చిన్న చిన్న గుడిసెలు, ఆప్యాయమైన పలకరింపులు. ‘‘పల్లెటూళ్లే దేశానికి పట్టుగొమ్మలు” అనే మాటకు నిలువెత్తు నిదర్శనం దేశ సరిహద్దులో ఉన్న ఈ ఊరి పేరు ‘‘ఖొనొమా’’. మన దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ విలేజ్​గా పేరొందిన ఖొనొమా ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి.

ఇండో – మయన్మార్ సరిహద్దులో నాగాలాండ్ రాష్ట్రంలో ఉంది ఖొనొమా. నేచర్​ కన్జర్వేషన్​ అండ్ ట్రాగొపన్ శాంక్చురీగా (కెఎన్​సిటిఎస్​)1998లో ఖొనొమాకు గుర్తింపునిచ్చారు. దాంతో అప్పటినుంచి అక్కడ వేట నిషేధం. ఈ ఊళ్లో అంగమీ తెగ వాళ్లుంటారు. వాళ్ల వృత్తి వేట. అయితే అక్కడ వేటను నిషేధించిన తర్వాత వాళ్ల లైఫ్ స్టైల్​ కూడా మారిపోయింది.

మనసు మార్చేశారు

ఖొనొమాలో1990 మొదట్లో వేటాడే పోటీలు జరిగేవి. ఆ పోటీల్లో 300 ‘ఖన్​ గహావా’(బ్లిత్స్​ ట్రాగొపన్​) పక్షుల ప్రాణాలు గాల్లో కలిసేవి. ఇలాగైతే ఆ జాతి పూర్తిగా అంతరించిపోతుందని ఛీఫ్ కన్జర్వేటర్, గ్రామ పెద్దలతో కలిసి అందమైన నేచర్​ని కాపాడేందుకు క్యాంపెయిన్​ చేశాడు. వేటాడే అలవాటును నెమ్మదిగా మాన్పించాలనుకున్నాడు. అక్కడ నివసించే నాలుగొందల కుటుంబాల మైండ్ సెట్ మార్చడానికి చాలా ప్రయత్నాలు చేశాడాయన. కొన్ని కన్జర్వేషన్​ ఆర్గనైజేషన్స్​ వచ్చి ఎడ్యుకేషన్​ వర్క్​ షాప్​లు నిర్వహించాయి. ప్రజలతో మాట్లాడి మోటివేట్ చేశారు. ఇలా దాదాపు ఐదేళ్లు పని చేస్తే... ఆ విలేజ్​లో చాలా మార్పు వచ్చింది. ఆ ప్రాజెక్ట్స్ కూడా దేశంలో మొదటి కమ్యూనిటీ కన్జర్వేషన్​ ప్రాజెక్ట్​గా నిలిచింది. 

ఆకుపచ్చని గ్రామం

ఆ ఊళ్లో ఎవరైనా వేటకి వెళ్తే... మూడు వేల రూపాయల ఫైన్. అది కాస్తా తర్వాత పదివేలకు పెరిగింది. వేటగాళ్లు షూట్ చేసిన గన్​ని కూడా సీజ్ చేసేవాళ్లు. నెలలో రెండు శనివారాలు నేచర్​ కోసం టైం కేటాయించేందుకు ఖొనొమా స్టూడెంట్ యూనియన్​ ఉండేది. అందులో నాలుగేళ్ల నుంచి పదహారేళ్ల మధ్య వయసున్న పిల్లలు ఉంటారు. వాళ్లంతా కలిసి ఊరిని శుభ్రం చేసే వాళ్లు. 2002లో పొగాకు లేని ఊరిగా కూడా పేరు తెచ్చుకుంది ఖొనొమా. ప్లాస్టిక్​ బ్యాగ్స్​, బాటిల్స్​ వాడకం కూడా బ్యాన్​ చేశారు అక్కడి ప్రజలు. అలా దాదాపు పాతికేండ్లుగా ఖొనొమా ప్రజలు వాళ్ల ఊరిని కాపాడుకుంటున్నారు. 2005లో ‘‘గ్రీన్​ విలేజ్’’​ అని పేర్కొంటూ భారత ప్రభుత్వం గౌరవించింది.

ప్రకృతి విపత్తులు, పర్యావరణంలో మార్పులు వచ్చినా, వారియర్స్​లా ముందుండి పోరాడతారు వాళ్లు. అందుకే వాళ్లను గ్రీన్​ వారియర్స్​ అంటారు. ప్రకృతి పరంగానే కాదు... ప్రజలకు కూడా సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. వాటిని కూడా ఖొనొమా ప్రజలు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఉదాహరణకు చెప్పాలంటే... మనదేశం బ్రిటిష్  పాలనలోకి వెళ్లినప్పుడు వీళ్లు బ్రిటిష్ వాళ్లకి ఎదురు నిలిచి పోరాడారు. 

వేటను నిషేధించిన తర్వాత వాళ్లలో చాలా మంది వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. కానీ కొన్ని నివేదికల ప్రకారం ఇంకా కొందరు అక్కడ వేటాడుతున్నారు. ఇక్కడికి చేరుకోవాలంటే కొహిమా నుంచి గంట ప్రయాణం చేయాలి. ఆ దారంతా అందమైన ప్రకృతి పలకరిస్తుంటుంది. ఆహ్లాదంగా వెల్​కం చెప్పే అందమైన ప్రకృతి వల్ల దేశంలోనే కాదు, ఇంటర్నేషనల్​గా కూడా ఈ గ్రీన్​ విలేజ్​కు​ మంచి గుర్తింపు వచ్చింది.