Lok sabha Election 2024: ఓటు వేయని మూడు గ్రామాలు .. రీజన్​ ఇదే

Lok sabha Election 2024:  ఓటు వేయని మూడు గ్రామాలు .. రీజన్​ ఇదే

భారతదేశంలో లోక్​సభ ఎన్నికలు ఇప్పటికి ఐదు దశలు కంప్లీట్​ అయ్యాయి. ఇంకా రెండు దశలు ( మే 25, జూన్​ 1)న  ఎన్నికలు జరుగునున్నాయి.  ఐదోవిడత పోలింగ్​ ఈ రోజు ( మే 20)న జరిగింది. ఆరు రాష్ట్రాలు.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఉత్తరప్రదేశ్​లోని రెండు గ్రామాలు.. జార్ఖండ్​ లోని ఒక గ్రామానికి సంబంధించిన ప్రజలు ఓటింగ్​కు దూరంగా.. ఈ మూడు గ్రామాల్లో ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు.  దీనికి కారణమేంటని అధికారులు ఆరాతీశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే...

ఓటు హక్కు ఉన్న వారందరూ ఓటెయ్యాలని.. ఇటు ప్రభుత్వాలు.. అటు రాజకీయ పార్టీలు.. స్వచ్చంద సంస్థలు ప్రచారం చేశాయి.  కాని ఐదో విడత జరిగిన ఎన్నికల్లో ( మే 20) ఓ మూడు గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. ఆ గ్రామాల్లో ఏ మాత్రం అభివృద్ది పనులు జరగలేదని.. కనీసం చేయాలనే ఆలోచన కూడా .. ఇటు ప్రభుత్వానికి కాని.. అటు ప్రజా ప్రతినిథులకు కాని రాకపోవడంతో తాము  ఓటు వేయడం లేదని ప్రజలు తెలిపారు.  తమ గ్రామాలను అభివృద్ది చెయ్యండి సార్​ అని కొన్ని దశాబ్దాలుగా మొర పెట్టుకున్న తమను ఎవరూ పట్టించుకోవడంలేదని ... ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇంతవరకు ఎవరూ అమలు చేయకపోవడంతో .. అంతేకాక తమ గ్రామాలను కాస్తంత అయినా డెవలప్​ చేయాలని అధికారులకు అనేకసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఎన్నికలను బహిష్కరించినట్లు  కౌశాంబి జిల్లాలోని హిసంపూర్ మర్హోలో గ్రామస్తులు తెలిపారు.


ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలోని హిసంపూర్ మర్హోలో గ్రామంలో నాలుగు రోడ్ల కూడళ్ల వద్ద ఎన్నికలను బహిష్కరిస్తూ.. గ్రామస్థులు తీసుకున్న నిర్ణయాన్నొ బహిరంగంగా ప్రకటిస్తూ పోస్టర్లు పెట్టారు. తమ గ్రామ ప్రజలు ఎక్కడకు వెళ్లాలన్నా..రోడ్​ సౌకర్యం లేదు.  ఏ దిక్కు నుంచి ఊరు దాటాలన్న రైలు పట్టాలు దాటుతూ నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ... ఇలా రైలు పట్టాలు దాటేసమయంలో కొంతమంది రైళ్ల కింద పడి చనిపోయారని గ్రామస్తులు పోస్టర్ల ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.  గతంలో జరిగిన ఎన్నికల సమయంలో ఓవర్​ బ్రిడ్జి నిర్మిస్తామని  అన్ని రాజకీయ పార్టీలు హామీ ఇచ్చినా.. ఇంతవరకు ఎవరూ ఆ సమస్య గురించి పట్టించుకోలేదని వాపోయారు. రాజకీయ నాయకులకు ఎన్నికలప్పుడు మాత్రమే ఓవర్​ బ్రిడ్జి విషయం గుర్తొస్తుందని.. ఆతరువాత ఆ విషయం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని గ్రామస్థులు అంటున్నారు. ఈ క్రమంలోనే వేలాది మంది ఓటర్లు ఎన్నికలను బహిష్కరించి ఇంటికే పరిమితమయ్యారు. 

ఓటింగ్ ప్రారంభమైన కొన్ని గంటల తర్వాత గ్రామంలోని ఎవరూ పోలింగ్ బూత్ వద్దకు రాకపోవడంతో సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ మహేంద్ర శ్రీవాస్తవ , ఇతర అధికారులు కలిసి గ్రామస్తులను ఓటు వేయమని అభ్యర్థించారు. అయినప్పటికీ గ్రామస్తులు.. అభివృద్ధి జరిగే వరకు ఓటు వేసేది లేదని తేల్చి చెప్పారు. మరోవైపు.. పరాహాజీ గ్రామ ప్రజలు కూడా ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. వారి సమస్య కూడా వంతెన కోసమే.

అటు.. జార్ఖండ్‌లోని కుసుంభ గ్రామంలోని 2 వేల మందికి పైగా ఓటర్లు ఓటు వేయలేదు. ఈ క్రమంలో.. డిప్యూటీ కమిషనర్ నాన్సీ సహాయ్ మాట్లాడుతూ, కుసుంభలోని రెండు పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. తాను, ఎస్పీ అరవింద్ కుమార్‌తో కలిసి ఓటు వేయమని గ్రామానికి వెళ్ళాము. బ్రిడ్జి కావాలన్న తమ డిమాండ్ నెరవేరితే ఓటేస్తామని గ్రామస్తులు చెప్పినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. 

హజారీబాగ్‌లో ప్లాంట్‌ ఉన్న నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ను గ్రామస్తులు వంతెన కోసం కోరినట్లు అధికారులు వివరించారు. అయితే అండర్‌పాస్‌ను నిర్మించాలని ఎన్‌టీపీసీ నిర్ణయించింది. అయితే దీనివల్ల తాగునీరు, నిత్యావసర సరుకులు, వైద్య సేవలకు ఇబ్బందిగా మారుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయమై గత రెండు నెలలుగా ఎన్టీపీసీతో మాట్లాడుతున్నామని జిల్లా యంత్రాంగం తెలిపింది.