
టాంటాన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన కనిపించింది. విండీస్ ఇన్నింగ్స్‌లో భాగంగా ముస్తాఫిజుర్ 49 ఓవర్ ఐదో బాల్ ని ఆఫ్ సైడ్ యార్కర్‌గా వేశాడు. అది కాస్తా స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న ఓష్నీ థామస్ దాటుకుని కీపర్ రహీమ్ చేతుల్లోకి వెళ్లింది.
బ్యాలెన్స్ తప్పడంతో థామస్ వికెట్లను బ్యాట్‌తో కొట్టాడు. ఆ క్రమంలోనే బెయిల్స్ కూడా కిందపడ్డాయి. బంగ్లా ఫ్యాన్స్ అంతా ఔట్ ఔట్ అంటూ అరిచారు. దీనిపై అనుమానం వచ్చిన ఫీల్డ్ అంపైర్లు.. థర్డ్ అంపైర్‌కు అప్పీల్ చేశారు. అయితే ఇది ఔట్ కాదని తేలింది. బాల్ ని థామస్ ఆడే క్రమంలో ఆ షాట్ పూర్తయిన తర్వాతే వికెట్లను బ్యాట్‌తో తాకడంతో.. థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఇది పెద్ద విషయం కాకపోయినా, బ్యాట్స్‌మన్ వికెట్లను కొట్టినా ఎందుకు ఔట్ ఇవ్వలేదు అంటూ నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు.