పార్టీలు మారాలనుకునేటోళ్లకు గడ్డుకాలం తప్పదు

పార్టీలు మారాలనుకునేటోళ్లకు గడ్డుకాలం తప్పదు

హైదరాబాద్, వెలుగు: పోయినేడాదితో పోలిస్తే ఈ ఏడాది సీఎం కేసీఆర్ జాతకం ఇంకా బాగుంటుందని శృంగేరి పీఠం వేద పండితుడు బాచంపల్లి సంతోష్​ కుమార్ శాస్త్రి చెప్పారు. ఈ ఏడాది పాలన అద్భుతంగా ఉంటుందన్నారు. కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయాలు  తీసుకోనున్నారని.. వీటిపై దేశమంతా ఆసక్తిగా చూస్తుందని పేర్కొన్నారు.  పార్టీలు మారాలనే ఆలోచన పెట్టుకునేటోళ్లకు గడ్డుకాలం తప్పదని చెప్పారు.

 ‘‘యాదాద్రి నరసింహుడికి ఉన్నట్లే సీఎం కేసీఆర్​కు మూడో నేత్రం ఉంది. ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరిని కలుస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో.. అన్ని విషయాలను కేసీఆర్ గమనిస్తున్నారు. కాబట్టి నాయకులు జాగ్రత్తగా ఉండాలి’’ అని అన్నారు. ఈసారి 75% మంచి ఫలితాలు ఉంటాయని, 25% గడ్డు ఫలితాలు ఉండొచ్చని చెప్పారు. శనివారం ప్రగతి భవన్​లో దేవాదాయ, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.

సంతోష్​ కుమార్ శాస్త్రి ఉగాది పంచాంగ శ్రవణం చెప్పారు. ‘‘ఇది ఉద్యోగనామ సంవత్సరం. మహిళలకు అనేక అవకాశాలు వస్తాయి.. వాళ్లే శాసిస్తారు. మహిళా ఐఏఎస్ అధికారులకు అద్భుతంగా ఉంటుంది” అని తెలిపారు. ‘‘రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీళ్లు, పచ్చని పంటలతో కళకళలాడుతుంది. వేసవిలోనూ సమృద్ధిగా నీళ్లు ఉంటాయి. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు అద్భుతంగా పండుతాయి” అని చెప్పారు. ‘‘మీడియాకు ఈ ఏడాదంతా పుష్కలంగా వార్తలు లభిస్తాయి’’ అని తెలిపారు.