AA పేరుతో అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారు: మంత్రి పొన్నం

AA పేరుతో అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారు: మంత్రి పొన్నం

రాజన్న సిరిసిల్ల:  ప్రధాని మోదీ.. ఎఎ పేరుతో అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని ఫైరయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్.  బుధవారం సిరిసిల్లలో మే డే దినోత్సవం వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి,  కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావులతోపాటు తదితరులు  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ..  సిరిసిల్ల కార్మికులు అందరికీ కాంగ్రెస్ పక్షాన మే డే శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని చెప్పారు. ఇప్పటికే ఆర్టీసి లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు రూ.500కి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు. పేదలకు రూ.10 లక్షల ఆరోగ్య శ్రీ ,200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు.

కార్మికుల సంబంధించి చాలా కార్యక్రమాలు చేస్తున్నామని పొన్నం చెప్పారు. భవిష్యత్ లో రూ.4 వేల పెన్షన్ ఇవ్వడంతోపాటు కొత్త పెన్షన్ లు మంజూరు చేస్తామని తెలిపారు. నూతన రేషన్ కార్డులు ఇచ్చే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు.  దక్షిణ భారతంతోపాటు ఉత్తారాన  కూడా బీజేపీనీ వ్యతిరేకిస్తున్నారని.. దాంతో ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. రిజర్వేషన్లు తొలగించే కుట్ర చేస్తున్నారని చెప్పారు. 

ప్రధాని స్థాయి వ్యక్తి.. కాంగ్రెస్ కు ఓటు వేస్తే.. అర్బన్ నక్సలిజం వస్తుందని, ముస్లింలకు ఆస్తులు పోతాయంటున్నారని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రధాన మంత్రి మోదీ వచ్చి ఆర్ఆర్ టాక్స్ అంటున్నారు.. మీరు ఎఎ పేరుతో అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని ఫైరయ్యారు. 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు.. తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మంత్రి నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్ లకు ఓటు వేస్తే వెస్ట్ అవుతుందని... వారి కుట్రలు ప్రజలు గమనించాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ కుల గణన చేస్తుంటే..దానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో అఫిడవిట్ చేశారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మద్దతుగా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి రాజేందర్ రావును గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని పొన్నం అన్నారు.